జోగులాంబ గద్వాల : స్కూల్ బస్సు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బల్గేర గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన ముక్కరయ్య అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అయిజ మండలానికి చెందిన లయోలా స్కూల్ బస్సు వెనుక నుంచి అతడిని ఢీ కొట్టింది.
గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. ముక్కరయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.