మల్లకల్ : గద్వాల, జడ్చర్ల, వనపర్తి, పెబ్బేరు, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో అపహరణకు గురైన మోటార్ సైకిల్ లను జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలంలోని అమరవాయి గ్రామంలో బుధవారం ఏపీలోని కర్నూలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమరవాయిలో 25 బైకులను పోలీసులకు పట్టుబడగా గ్రామస్తుల ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల పట్టణానికి చెందిన జశ్వంత్ వారం రోజుల క్రితం కర్నూలు పట్టణంలో మోటర్ సైకిల్ ను దొంగలించడంతో కర్నూలులోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
దీంతో సిఐ నాగరాజరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మోటార్ సైకిల్ చోరీ పై విచారణ చేపట్టి గద్వాల పట్టణానికి చెందిన జస్వంత్ ను అదుపులోకి తీసుకున్నారు.నిందితుడిని విచారించగా 30 కు పైగా బైకులు చోరీ చేసినట్లు అంగీకరించారు. దీంతో సీఐతో పాటు పోలీస్ సిబ్బంది మహేందర్, రవి, శ్రీను అమరవాయికి చేరుకొని జస్వంత్ కు సహకరించిన బోయ వీరేష్ పాండు, బోయ పాండులను అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో జస్వంత్ చోరీ చేసిన బైకులను గ్రామంలోని కొంతమందికి రైతులకు, వ్యాపారులకు, తక్కువ ధరకు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
దొంగలించిన బైకులను కొన్న యజమానులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించడంతో వారు బైకులను పోలీసులకు అప్పగించారు. అమరవాయిలో 18, బిజ్వారంలో 2, సద్దలోనుపల్లి, ఐజ తదితర గ్రామాల్లో 25 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా వాహనాలను త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. తక్కువ ధరలకు వస్తున్నాయని ఎవరు కూడా వాహనాలను కొనుగోలు చేయొద్దని పోలీసులు రైతులకు, వ్యాపారులుకు సూచించారు.