కొవిడ్ కారణంగా మూతపడిన విద్యాసంస్థలు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ విడుదల చేసిన విధీ విధానాలను అనుసరిస్తూ పేట జిల్లా వ్యాప్తంగా రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో బుధవారం ప్రత్యక్ష తరగతులను ప్రారంభించారు. కరోనా కారణంగా 18 నెలల విరా మం తర్వాత విద్యార్థులు ముఖానికి మాస్కులు ధరించి ఉత్సాహంగా హాజరయ్యారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ నిర్వహించి తరగతి గదుల్లోకి అనుమతించారు. కొన్ని చోట్ల హెచ్ఎంల ఆధ్వర్యంలో పాఠశాల మెయిన్ గేట్లకు బెలూన్లు, ఫ్లకార్డులు కట్టి విద్యార్థులను స్వాగతించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించాయి. మొదటి రోజు అంతంత మాత్రమే విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లియాఖత్ అలీ తెలిపారు.
పాఠశాలలకు రావడానికి భయపడే విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చేలా చర్యలు తీసుకోమన్నారు.
ఉపాధ్యాయులు వివిధ కారణాలతో విధులకు గైర్హాజరైనట్లు ఎంఈవోలు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కొంత మంది విద్యార్థులు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలతో భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులను కూర్చోబెట్టారు. పలు పాఠశాలలను కలెక్టర్ హరిచందన, జెడ్పీ సీఈవో సిద్ధి రామప్ప, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, ఎంపీడీవోలు, ఎంఈవోలు సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం క్రమం తప్పకుండా వండాలని, విద్యార్థులకు శుచి, శుభ్రతతో భోజనం వడ్డించాలని ఉపాధ్యాయులు, వంట సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.