నవాబ్‌పేట, సెప్టెంబర్1: భూమి అమ్మగా వచ్చిన డబ్బుల విషయమై వచ్చిన గొడవ కారణంగా ఆగ్రహానికి గురైన భార్య, భర్తను హత్య చేసిన మృతదేహాన్ని బాత్రూం గుంతలో పూడ్చివేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం మొరంబాయి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దర్పల్లి పంచాయతీ మదిర గ్రామమైన మొరంబాయికి చెందిన రైతు పండుగ చెన్నయ్య(45), రాములమ్మ భార్యాభర్తలు. నాలుగు నెలల కిందట వీరికి నాలుగు ఎకరాలు వ్యవసాయ భూమి ఉండగా.. ఎకరా పొలాన్ని రూ.10 లక్షలకు విక్రయించారు. అయితే వచ్చిన డబ్బులను తనకు ఇవ్వాలని భార్య రాములమ్మ భర్తను అడుగుతూ వచ్చింది. ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నది. ఈ క్రమంలో రెండు నెలల కిందట గ్రామంలో వారు కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో బంధువులతో కలిసి భర్తకు మద్యం తాగించింది. ఫుల్‌గా తాగిన తర్వాత చెన్నయ్యను బంధువుల సాయంతో అర్ధరాత్రి గొంతు నులిమి హత్య చేసింది.
ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంట్లోని బాత్రూం వద్ద గుంతలో మృతదేహాన్ని పూడ్చి వేసినట్లు అనుమానం. తర్వాత తన భర్త కనిపించడం లేదని ఇరుగు పొరుగు వారికి చెప్పింది. స్థానిక బంధువుల ఒత్తిడి మేరకు నెల కిందట తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా.. భార్యపై అనుమానంతో ఆమెను విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. బుధవారం ఎస్సై శ్రీకాంత్, ఆర్ఐ జ్ఞానేశ్వర్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. శవం పూడ్చిన స్థలంపై క్లారిటీ రాకపోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. గురువారం అనుమానితులను సమగ్రంగా విచారించిన అనంతరం డాక్లర్లు, రెవెన్యూ అధికారుల సమక్షంలో పూడ్చిన శవాన్ని వెలికితీస్తామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.