ధరూర్, ఆగస్టు 25 : వంద రూపాయల మార్కును దాటి నూట పది రూపాయల దిశగా దూసుకుపోతున్న పెట్రోలు ధరలను భరించలేక ఓ యువకుడు తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. ధరూర్‌కు చెందిన ఆంజనేయులు తన పొలం పనులకు, గద్వాల పట్టణానికి వెళ్లి ఏమైనా సరుకులు కొని తెచ్చుకునేందుకు బజాజ్ ప్లాటినా వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఏ ముహూర్తాన బైక్ కొనుగోలు చేశాడో కానీ నిత్యం పెట్రోల్ ధరలు ఆకాశం వైపు ఎగిసాయి. కండ్ల ముందే రూ.వంద మార్క్ దాటుకొని రూ.106 దాటిపోయింది. పెట్రోల్ ధరలు భారీగా పెరుగిపోతుండడంతో తీవ్రంగా ఆవేదన చెందిన ఆంజనేయులు బుధవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద రూ.500 విలువచేసే పెట్రోల్ కొని తన ద్విచక్రవాహనంపై చల్లి నిప్పంటించాడు.
వాహనం తగలబడి పోవడంతో స్థానికులు నీళ్లు తీసుకువచ్చి ఆర్పే ప్రయ త్నం చేశారు. అప్పటికే సీటు, వైరింగు, మిగతా భాగాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎవరన్నా కొత్త బండిని తగలబెట్టుకుంటారా..? అని స్థానికులు యువకుడిని ప్రశ్నిస్తే.. నా బాధ మీకేం తెలుస్తుంది.. నా బండి నేను తగలబెట్టుకుంటాను… పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.. అంత డబ్బులు వెచ్చించి పెట్రోల్ పోయలేక కడుపు మండి నా బండి తగులబెట్టుకున్నాను. ప్రధాని మోడీ వల్లే ధరలు పెరిగిపోయాయంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. కేంద్రం తీరుతో రోజురోజుకూ పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో రైతు ఆవేదనకు ఈ ఘటన అద్దం పడుతున్నది.