నవాబ్‌పేట, ఆగస్టు 25 : మండలంలోని అధికారులు అలసత్వం వీడి పని చేయాలని ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ ముత్యాల రవీందర్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరుపై ప్రజాప్రతినిధులు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ పనితీరును ఏవో కృష్ణకిశోర్ వివరిస్తుండగా.. ఎంపీపీ అనంతయ్య, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, పలువురు సర్పంచులు స్పందిస్తూ రైతుల రుణమాఫీ జాబితా నేటికీ తమకు అందలేదని పేర్కొన్నారు.
మండలంలోని ఎంతమందికి రుణమాఫీ వచ్చిందనే విషయం కూడా అధికారుల్లో క్లారిటీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, గ్రామీణ తాగునీటి శాఖల పనితీరును ఏఈలు షమీయుల్లాఖాన్, సురేశ్ వివరిస్తుండగా.. ఎంపీపీ, సర్పంచ్ సత్యం, వెంకటేశ్ తదితరులు మాట్లాడుతూ లోకిరేవు, పోమాల్ గ్రా మాల్లో నేటికీ మిషన్ భగీరథ నీరు అందడంలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మెటీరియల్ ఇవ్వగా.. పనులు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో చాలా గ్రామాల్లో భగీరథ నీరు రావడంలేదన్నారు. అలాగే ఐసీడీఎస్ పనితీరును సీడీపీవో శాంతిరేఖ వివరిస్తుండగా.. వైస్‌ఎంపీపీ, ఎంపీటీసీలు రాధాకృష్ణ, గోపీకృష్ణ, సర్పంచ్ వెంకటేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే పౌష్టికాహారం విద్యార్థులకు సక్రమంగా అందించడం లేదని, అంగన్వాడీల్లో చేపట్టే కార్యక్రమాల సమాచారం ప్రజాప్రతినిధులకు ఇవ్వడంలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. విద్యాశాఖ పనితీరును ఎంఈవో రాజునాయక్ వివరిస్తుండగా.. ఎంపీపీ స్పందిస్తూ ఈనెలాఖరులోగా పాఠశాలలను శుభ్రం చేయించాలని కోరారు. అనంతరం ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అలాగే ఉపాధి కూలీలకు జాబ్‌కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ డీఎన్ రావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, ట్రా న్స్‌కో ఏడీ తౌర్యానాయక్, వైద్యాధికారి నవీన్‌రెడ్డి, డిప్యూ టీ తాసిల్దార్ లిఖితారెడ్డి, పశువైద్యాధికారి రవిచంద్ర, కోఆప్షన్ సభ్యుడు తాహెర్ తదితరులు ఉన్నారు.