కర్నెతండా ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి చేయిస్తాం
రేయింబవళ్లు పనులు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలి
కర్నెతండా లిఫ్ట్ పనుల ప్రారంభంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
ఖిల్లాఘణపురం, మార్చి 13:‘ఖిల్లా’ మండలంలో నిర్మించనున్న కర్నె తండా లిఫ్ట్‌తో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆగస్టు 15 కల్లా పనులు పూర్తి చేయిస్తామని చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో కర్నెతండా లిప్ట్ పనులను మంత్రి భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న పైలాన్నుఆవిష్కరించారు. ఇటీవల సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలో ఈ లిఫ్ట్ పనులకు శంకుస్థాపన చేయగా.. నేడు పనులను ప్రారంభించినట్లు తెలిపారు. రూ.76.19 కోట్లతో 150 రోజుల్లో పూర్తి చేసేదిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ పనులు పూర్తయితే పదేండ్లు కరువు వచ్చినా సాగునీటికి ఢోకా ఉండదన్నారు.
ప్రతి గ్రామం, తండాలకు సాగునీటిని అందజేయాలనే దృఢ సంకల్పంతో కర్నెతండా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, లిప్ట్ పనులను ఆగస్టు 15వరకు పూర్తిచేయిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఆదివారం భూమిపూజ చేసి ప్రారంభించి అక్కడే పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రంలో కర్నెతండా లిప్ట్ పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.76.19కోట్లతో ఈ పనులను 150 రోజుల్లోపు అంటే ఆగస్టు 15లోగా పూర్తిచేసి సాగునీరు అందించే దిశగా ముందుకుసాగుతున్నామన్నారు. ప్రభుత్వం ఇటీవలే పరిపాలన అనుమతులతోపాటు రూ.50కోట్లను కూడా విడుదల చేసిందని, ఘనపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా మైసమ్మ చెరువు నుంచి ఒక అప్రోచ్ కాలువను తవ్వుతూ ఈ అప్రోచ్ కాలువ ద్వారా నీటిని తరలించి కర్నెతండాలో ఎత్తైన ప్రదేశంలో పంప్ హౌస్ ద్వారా నీటిని పంప్ చేస్తామన్నారు. అక్కడి నుంచి మామిడిమాడ, లట్టుపల్లి, జంగమాయిపల్లి కెనాల్ ద్వారా దాదాపు 1,465 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. 6గ్రామాలతోపాటు 16గిరిజన తండాలకు సాగునీరు అందుతుందని, ఘణపురం మండలమే కాకుండా పెద్దమందడి, వనపర్తి, బిజినేపల్లి మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. కర్నెతండా లిప్ట్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఎత్తైన ప్రదేశం కావడంతో ఈ స్థలాన్ని ఎంచుకోవడం జరిగిందని, లిప్ట్ ఏర్పాటు ద్వారా దాదాపు 100ఎకరాల భూమి కలిగిన రైతులు నష్టపోయినప్పటికీ వారంతా స్వచ్ఛందంగా ముందుకువచ్చి పొలాలను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు పంట నష్టపరిహారం త్వరలోనే వచ్చేవిధంగా చూస్తానని హామీ ఇచ్చారు. పది సంవత్సరాలు కరువు వచ్చినా ఖిల్లాఘణపురం మండలం కర్నెతండా లిప్ట్‌తో సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. వేగవంతంగా జరుగుతున్న పనులను ప్రతిరోజు అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వివిద శాఖల్లో పని చేస్తున్న అధికారులు ఇక్కడికి వచ్చి చూసి ఆనందం వ్యక్తం చేసే విధంగా ఉండాలన్నారు.
ఖిల్లాలో సామూహిక భవన పనులు ప్రారంభం
మండల కేంద్రంలోని రూ.75లక్షలతో ఏర్పాటు చేయనున్న సామూహిక భవన నిర్మాణ పనులను మంత్రి నిరంజన్‌రెడ్డి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామూహిక భవనం వల్ల కుల, మతాలకతీతంగా వివాహ తదితర శుభకార్యాలు ఇక్కడ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను చేపట్టాలని కాంట్రాక్టర్ మురళీధర్‌రెడ్డికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యానాయక్, మార్కెట్‌కమిటీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, సర్పంచులు వెంకటరమణ, శేఖర్‌రెడ్డి, శాంత, రాజునాయక్, నాయకులు కృష్ణయ్యగౌడ్, భూమయ్య, యాదవులు, రాంచంద్రయ్య, ఆంజనేయులుగౌడ్, రాజు, వెంకటేశ్, మల్లేశ్, బాల్‌రెడ్డి, సురేందర్, సాయులు, రాము, పర్వతాలు, శేషయ్య పాల్గొన్నారు.