శ్రీశైలం/నాగర్‌కర్నూల్/అచ్చంపేట/ మార్చి 13: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ దంపతులు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీశైలం చేరుకున్న దంపతులకు ఆలయ మర్యాదలతో లవన్న, అధికారులు ఘనస్వాగతం పలికారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు తర్వాత రెండోసారి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ కూడా కుటుంబ సమేతంగా మల్లికార్జునస్వామి దర్శనం చేసుకున్నారు. మార్గమధ్యంలో వెళ్తూ వారు నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ హరితహోటల్లో కాసేపు విడిది చేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అమ్రాబాద్ రిజర్వు ఫారెస్టు జ్ఞాపికను కలెక్టర్ ఉదయ్‌కుమార్ సీజేకు అందజేశారు. అనంతరం శ్రీశైల క్షేత్రానికి పయనమయ్యారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా, సెషన్స్ జడ్జి రఘురాం, మహిళా పోక్సో జడ్జి ఉమాదేవి, నాగర్‌కర్నూల్ సీనియర్ సివిల్ జడ్జి శీతల్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెంకట్రాం, డీఎస్పీ గిరిబాబు ఉన్నారు.