కొంగుబంగారం రామలింగేశ్వరుడు
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ప్రతాపరుద్రుడు నిర్మించిన ఆలయం
మూసాపేట(అడ్డాకుల), మార్చి 13: దక్షిణ కాశీగా పేరుగాంచిన కందూరు రామలింగేశ్వరస్వామిని క్షేత్రాన్ని నమ్మి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. కాశీలో తప్పా మరెక్కడా లేనటువంటి కల్ప వృక్షాలు కందూరు రామలింగేశ్వరుడి కోనేరు చుట్టూ ఉన్నాయి. ఆ వృక్షాలు మానవుల జన్మనక్షత్రాల సంఖ్యలో ఉండడంతో మహాశక్తి గల ఆలయంగా ప్రతీతి. కాకతీయుల చరిత్రకు నిలయంగా చెప్పుకొంటారు. మహబుబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామంలో క్షేత్రం ఉన్నది. ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ వంశస్థుడు ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు ‘పాలమూరు జిల్లా దేవాలయాలు’ అనే గ్రంథంలో లిఖించబడినది. ప్రతి సంవత్సరం హోలీ పండుగను పురస్కరించుకొని కాముడి దహనం చేసి అదే రోజు స్వామి వారి తేరు లాగి ఉత్సవాలు ప్రారంభిస్తారు. జాతర నెల రోజులపాటు కొనసాగుతుంది. భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు.
ఉత్సవ కార్యక్రమాలు
కందూరు రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతాయి. 20నుంచి ఏప్రిల్ 10వ తేదీ శ్రీరామ నవమి వరకు జాతర కొనసాగుతుంది. 14న భూతబలి యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, త్రిశూలపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, బలిహరణలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 15న పార్వతీ సమేత పరమేశ్వరుడి కల్యాణం, 16న ప్రభోత్సవం, అశ్వవాహన సేవ, 17న రథోత్సవం, 18న వృషభవాహనం సేవ, 19న రుద్రహోమం, మహా పూర్ణాహుతి, త్రిశూల స్నానం, తీర్థావళి కార్యక్రమాలు ఉంటాయి.