అదనపు కలెక్టర్ శ్రీ హర్ష
మల్దకల్, మార్చి 11: మండలంలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. మండలంలోని బిజ్వారం గ్రామాన్ని డీపీవో శ్యాం, ఎంపీడీవో కృష్ణయ్యతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీలు అపరిశుభ్రంగా ఉండటం చూసి కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో గ్రామంలోని అన్ని వీధులను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తా చెదారం పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. అనంతరం నర్సరీని పరిశీలించారు. నర్సరీలో చాలా వరకు మొక్కలు చనిపోయాయాని వీటి స్థానంలో కొత్త మొక్కలు నాటి వారిని సంరక్షించాలని సూచించారు. అలాగే పాఠశాల పరిసరాల్లో చెత్తా చెదారం చూసి కార్యదర్శి, హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు పాఠశాల మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారివెంట ఎంపీవో చెన్నయ్య, కార్యదర్శి పాల్గొన్నారు.
దుకాణాలకు బహిరంగ వేలం
గద్వాల అర్బన్, మార్చి 11: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియానికి ఆనుకొని ఉన్న 6 దుకాణాలను బహిరంగ వేళంలో అద్దెకు ఇవ్వనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీహర్ష శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ప్రతి షాపు దాదాపు 214 చ.ఫీ విస్తీర్ణం ఉందని పేర్కొన్నారు. వ్యాపారం నిర్వహించేందుకు అనువైన ప్రదేశమని, ఆసక్తిగల వ్యక్తులు జిల్లా క్రీడల యువజన శాఖ కార్యాలయంలో దరఖాస్తు ఫారం పొంది, 22వ తేదీలోగా అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు పీడీ జితేందర్ నెంబరు 9440081152కు సంప్రదించాలన్నారు.
వందశాతం వసూలు చేయాలి
అయిజ, మార్చి 11: మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వందశాతం వసూలు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో ఆస్తిపన్నుపై అదనపు కలెక్టర్ సమీక్ష చేశారు. పన్ను వసూలులో అయిజ వెనుకబడి ఉందని, వసూలును వేగవంతం చేయాలని సూచించారు. బిల్ కలెక్టర్లకు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టార్గెట్ పూర్తి చేసిన బిల్ కలెక్టర్లకు రివార్డులు ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ నర్సయ్య, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆస్తిపన్ను చెల్లించకుంటే నల్లా కనెక్షన్ కట్
పట్టణంలోని ఆస్తిపన్ను చెల్లించకుంటే నల్లా కనెక్షన్ కట్ చేస్తున్నట్లు కమిషనర్ నర్సయ్య పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్సీ కాలనీలో పన్ను చెల్లించని రెండు ఇండ్లకు నల్లా కనెక్షన్ తొలగించినట్లు తెలిపారు. ఆస్తిపన్ను బాకాయిదారులు ఈనెల చివరిలోగా పన్నులు చెల్లించాలని కోరారు. చార్జీలు చెల్లిస్తేనే నల్లాను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.