Coriander Leaves | సాధారణంగా చాలా మంది వంటలు చేసిన తరువాత అవి మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి చివర్లో కొత్తిమీరను వేస్తూ ఉంటారు. కొత్తిమీర వేయడం వల్ల వంటలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వంటలు కూడా ఆహ్లాదకరమైన వాసన వస్తాయి. అయితే కొత్తిమీర కేవలం వంటలు ఆకర్షణీయంగా కనిపించేలా చేయడం మాత్రమే కాదు దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కొత్తిమీరలో అనేక పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, జీర్ణక్రియ సాఫీగా సాగడం వంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల డయాబెటిస్ తో బాధపడే వారికి మేలు కలుగుతుంది. దీనిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే కొన్ని రకాల ఎంజైమ్ లు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే కొత్తిమీర తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తో పాటు ఎక్కువ ఫైబర్ ను కలిగి ఉంటుంది. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నీటిలో కొత్తిమీర ఆకులను వేసి నానబెట్టి ఆ నీటిని తాగుతూ ఉండడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. కొత్తిమీర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్ ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. తరచూ ఇన్పెక్షన్ ల బారిన పడే వారు కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల అందమైన, ఆరోగ్యవంతమైన చర్మాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. శరీరంలో ఆమ్లత్వం ఎక్కువవడం వల్ల చర్మం ఎర్రగా మారడం, గడ్డలు, మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి సమస్యలతో బాధపడే వారు కొత్తిమీరను తీసుకోవడం వల్ల ఆయా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్లత్వం తగ్గుతుంది. తద్వారా చర్మ సమస్యలు తగ్గి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దీంతో ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది.
కొత్తిమీర గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడుతుంది. కొత్తిమీర మూత్రవిసర్జన కారకం కాబట్టి ఇది మన శరీరం నుండి అదనంగా ఉండే సోడియంను బయటకు పంపిస్తుంది. దీంతో అధిక రక్తపోటు తగ్గుతుంది. కొత్తిమీరను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.