– జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రుడు హెచ్చరిక
– వారంలోగా ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని అడిషనల్ డీజీ, ఎస్పీకి ఆదేశాలు
– పది రోజుల్లో రీ పోస్టుమార్టం చేసి రిపోర్ట్ అందించాలని ఆదేశం
– రాజేష్ కుటుంబానికి పరామర్శ, పెన్షన్ పత్రాలు అందజేత
– ఉద్యోగం, మూడు ఎకరాల భూమి, ఇల్లు సమకూర్చేందుకు కలెక్టర్ అంగీకారం
కోదాడ, ఫిబ్రవరి 16 : దళితులను రక్షించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రుడు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో ఇటీవల పోలీస్ లాక్అప్ డెత్‌కు గురైన కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేష్ తల్లి లలితమ్మతో మాట్లాడి రాజేష్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నుండి మంజూరైన పెన్షన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, అడిషనల్ డీజీ చౌహన్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సమక్షంలో అందజేశారు. అనంతరం కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వాకబు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కర్ల రాజేష్ మృతిని పత్రికల్లో చూసి ఎస్సీ కమిషన్ సుమోటోగా స్వీకరించిందని తెలిపారు. కమిషన్ కేసులో ప్రవేశించిన అనంతరం ఎఫ్ఐఆర్ చేశారని అంతకుముందు జరగలేదన్నారు.
రాజేష్ మృతిపై నేటి వరకు చార్జీషీట్ ఎందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కమిషన్ చార్జిషీట్ వెంటనే దాఖలు చేయాలని ఆదేశించినట్లుత తెలిపారు. కేసులో బాధ్యులైన సిఐని సస్పెండ్ చేయడమే కాదు ఎస్ఐని కూడా వారం రోజుల్లో సస్పెండ్ చేయాలని అడిషనల్ డీజీ, జిల్లా ఎస్పీని ఆదేశించారు. పది రోజుల్లో రీ పోస్టుమార్టం చేసి నివేదికను అందించాలని ఆదేశించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సెక్షన్ 4 ప్రకారం కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు జవాబు ఇవ్వకపోతే నిర్లక్ష్యానికి బాధ్యులను చేస్తూ చట్ట ప్రకారం సస్పెన్షన్‌తో పాటు ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాజేష్ తల్లికి మూడు రోజుల్లో ఉద్యోగం, పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మూడు ఎకరాల భూమి ఇచ్చేందుకు కలెక్టర్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అడిషనల్ డీజీ చౌహన్, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి రాజు ఉన్నారు.

‘రాజేశ్ మృతిపై అధికారులు జవాబివ్వకపోతే ఆరు నెలలు జైలుకే’