తిమ్మాజిపేట, ఫిబ్రవరి 3 : విద్యా రంగానికి చేయూతనిస్తూ తన ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలన్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆశయం అంకురార్పన కానున్నది. ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దశల వారీగా మౌలిక వసతులు కల్పించాలన్న మహా సంకల్పంలో మొదటి అడగు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఎమ్మెల్యే సొంత మండలం తిమ్మాజిపేటలో ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో నిర్మించిన పాఠశాల భవన సముదాయాన్ని శుక్రవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
సకల హంగులతో..
తిమ్మాజిపేటలోని ప్రభుత్వ పాఠశాల భవనం ‘న భూతో.. న భవిష్యత్’ అన్నట్లుగా నిర్మించారు. రెండంతస్తుల భవనం నిర్మించారు. పాత భవనానికి మరమ్మతులు చేసి పూర్తిగా సుందరీకరించారు. ప్రతి తరగతి గదిలో అధునాతనమైన ఫర్నిచర్, ఫ్యాన్లు, ఉపాధ్యాయుల కోసం బేంచీలు, బ్లాక్ బోర్డులు, కాంతినిచ్చే లైట్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక గది, భోజనం కోసం మరో గది, అల్మారాలు, అధునాతనమైన టాయిలెట్లు, విద్యార్థుల కోసం ప్రత్యేక వంటశాల, విశాలమైన డైనింగ్ హాల్ నిర్మించారు. గతంలో ఇరుకుగా ఉన్న మైదానాన్ని విస్తరించారు. వాలీబాల్, కబడ్డీ కోర్టులను ఏర్పాటు ఫ్లడ్ లైట్లు బిగించారు. జడ్చర్ల,-నాగర్‌కర్నూల్ ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ భవనం ఆకట్టుకుంటున్నది.
సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా..
– మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే నాగర్‌కర్నూల్
పేదింటి ఆడపిల్లలకు అన్నగా పెండ్లిండ్లు చేశా.. కరోనా విపత్తుతో పెండ్లిళ్లు చేయలేక, ఆ డబ్బును విద్యారంగానికి మళ్లించా. తిమ్మాజిపేటలో అన్ని హంగులతో పాఠశాల భవనం నిర్మించా. కార్పొరేట్ సౌకర్యాలు కల్పించాం, ప్రస్తుతం రూ.5 కోట్లతో తాడూర్, నేను చదువుకున్న సిర్సవాడ పాఠశాలలకు భవనాలు నిర్మిస్తున్నాం. భవిష్యత్‌లో మరిన్ని చేపడుతాం. మా ట్రస్ట్ ద్వారా సంక్షేమంతో పాటు విద్యా, వైద్య రంగానికి ప్రాధాన్యమిస్తాం.