గద్వాల, మార్చి 22 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌కు త్వరలో మహర్దశ చేకూరనున్నది. శిథిలావస్థకు చేరుకున్న పాత బస్టాండ్ స్థానంలో సకల సౌకర్యాలతో నూతనంగా నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వానకాలంలో బస్టాండ్ పై కప్పు నుంచి నీరు కురుస్తుండడంతోపాటు పెచ్చులు ఊడుతున్నాయి. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికు లు జంకుతున్నారు. ఇదంతా గమనించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సీఎం కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గద్వా ల అభివృద్ధి నిధుల నుంచి బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని వారు సూచించడంతో ఆ దిశగా అడుగులు పడ్డాయి. గతేడాది సెప్టెంబర్ 14న గద్వాలకు మం త్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా నూతన బస్టాండ్ పునర్మిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదట రూ.2 కోట్లు కేటాయించగా.., భవిష్యత్ అవసరా లు, మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని అంచనా వ్యయాన్ని రూ.4 కోట్లకు పెంచారు. టెండ ర్లు పూర్తి కాగా.., పనులు త్వరలో ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్టాండ్ ఆవరణలో బస్సులు నిలిపేందుకు నిర్మిస్తున్న తాత్కాలిక్ షెడ్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుత బస్టాండ్‌ను త్వరలో కూల్చి వేయనున్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌కు 12 ప్లాట్‌ఫాంలు ఉండగా.. 15 ప్లాట్‌ఫాంలతో నూతన బస్టాండ్‌ను నిర్మించనున్నారు.
బస్టాండ్ నేపథ్యం..
1980 సంవత్సరంలో గద్వాలలో ఆనాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1986లో ఆర్టీసీ గోల్కొండ రీజియన్ చైర్మన్ చంద్రశేఖర్ ప్రారంభించారు. సుమారు 36 ఏండ్లుగా సేవలందించిన బస్టాండ్ శిథిలావస్థకు చేరుకున్నది. అందుకే కొత్తది నిర్మించేందుకు సర్కార్ పూనుకున్నది. గద్వాల డిపోలో 108 బస్సులు ఉన్నాయి. రోజుకు సుమారు 38 వేల కిలోమీటర్ల మేర బస్సులు తిరుగుతున్నాయి. రోజు వారీ రూ.13 లక్షల వరకు ఆదాయం వస్తుంది. బస్టాండ్ పునర్మిర్మాణం చేస్తుండడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సకల సౌకర్యాలు కల్పిస్తాం..
ప్రస్తుతం ఉన్న బస్టాండ్ స్థానంలో కొత్తగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 12 ప్లాట్‌ఫాంలు ఉండగా వాటిని 15కు పెంచాం. సకల సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. తాత్కాలిక బస్షెల్టర్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి. పనులు పూర్తి కాగానే బస్టాండ్‌ను కూల్చి వేస్తాం.
– రామ్మోహన్, డిపో మేనేజర్, గద్వాల