విత్తనాలు,ఎరువులు రైతులకు అందుబాటులో ఉండాలి
వీసీలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
గద్వాల, జూన్ 7: వానకాలంలో రైతులు సాగుచేసే పం టల వివరాల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరబాద్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావుతో కలిసి జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. 2020 వానకాలం,యాసంగిలో రైతులు సాగు చేసిన వరి, పత్తి వివరాల నివేదిక అందజేయాలని సూచించారు. పంటల నమోదు కార్యక్రమాన్ని అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా పంట నమోదును సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. అలాగే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ఆయా మండల కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. ఎరువులు, విత్తనాల సమస్య ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా వ్యవసాయ శాఖ అధికారులదేనని తెలిపారు. ఎక్కడైనా ఎరువులు, విత్తనాల కొరత ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. వానకాలం పంటసాగులో రైతులు ఎవరూ ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌నాయక్, ఏడీఏ సక్రియానాయక్, మండల వ్యవసాయ అధికారులు సుచరిత, భాస్కర్‌రెడ్డి, శంకర్‌లాల్, శ్వేత, అనిత, సురేఖ, రాజశేఖర్, కరుణశ్రీ, శ్రీలత, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.