గట్టు : విద్యాభివృద్ధిలో వెనుకబడిందని చెప్పుకునే గద్వాల జిల్లా గట్టు మండలంలో ఆ అపవాదును చెరిపేసింది ఆ విద్యార్థిని. బాగా చదివి ఉన్న ఊరు, కన్న తల్లిదండ్రులకు రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రాయపురంకు చెందిన నర్సమ్మ, బోయ లక్ష్మణుల కూతురు లావణ్య బాలానగర్ లోని గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం (బైపిసి) చదువుతోంది.
కాగా, నిన్న వెలువడిన ఫలితాల్లో ఆ విద్యార్థిని 439/440 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకును సాధించింది. ఈ సందర్భంగా రాయపురం పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు విద్యార్థినితో పాటు తల్లిదండ్రులను అభినందించారు. పదవ తరగతి కూడా కేజీబీవీలో చదివిన ఈ విద్యార్థిని గురుకుల పాఠశాలలో చదువుతూ ప్రతిభ కనబరచడం విశేషం.