అయిజ : ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ ఏమైందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలివిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు రైతులను నిండా ముంచిందని మండిపడ్డారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని సింధనూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు రూ.2 లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని రైతులు నిరసన తెలిపారు. రైతుల నిరసనకు బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురవ పల్లయ్య మద్దతు తెలిపారు.
పల్లయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్న దుర్మార్గమైన సర్కారు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ సర్కారేనని దుయ్యబట్టారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని అన్నారు. కాంగ్రెస్ అంటేనే కరువు, కుట్ర, నయవంచన, మోసం, దగా అని మండిపడ్డారు. రైతు భరోసా ఎకరాకు రూ.15, 000 ఇస్తామని చెప్పి, సిగ్గు లేకుండా రూ.12,000 లకు తగ్గించారని, ఆ రూ.12,000 కూడా వేయకుండా రూ.6 వేలు వేస్తున్నారని విమర్శించారు.
ఐదెకరాల రైతులకు రైతు భరోసా వేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. భూమిలేని నిరుపేద కూలీలకు ఉపాధి హామీ పథకం కింద రూ.12 వేలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వం దగా చేసిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అర గ్యారెంటీ కూడా అమలు చేయలేని చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 420 హామీలు ఇచ్చి పక్కా 420గా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పించన్ల పెంపు ఏవీ లేవన్నారు.
నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులను మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి అని పల్లయ్య మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టి పదవి కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు తప్ప.. రాష్ట్రానికి ఒరుగపెట్టింది ఏమీ లేదన్నారు. ప్రజాపాలన కాదు ఇది రాబందుల పాలన, నిర్బంధాల పాలన అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను మెడలు వంచైనా బీఆర్ఎస్ అమలు చేయిస్తుందని రైతులకు చెప్పారు. కార్యక్రమంలో రైతులు దేవేంద్ర రెడ్డి, కుర్వ తిమ్మప్ప, ఉప్పరి దేవేంద్ర, తులసి గౌడ్, కుమ్మరి జమ్మన్న, నడిపి రామన్న, చాకలి రంగన్న, మెడికల్ రాజు, నడిపెన్న, ఉరుకుందమ్మ, పార్వతమ్మ, కోటి, బోయ వీరేష్, నరసింహులు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.