KT Doddi PS: జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో (KT Doddi PS) అక్రమ వసూళ్లు కలకలం సృష్టిస్తున్నది. పాగుంట జాతరలో ఎస్ఐ, కానిస్టేబుల్ భారీ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారించి కాలూరు తిమ్మన్ దొడ్డి (కేటీ దొడ్డి) ఎస్ఐ బీ.శ్రీనివాసులు, కానిస్టేబుల్ రజనీబాబును గద్వాల ఏఆర్‌కు అటాచ్ చేశారు. తాజాగా, వసూళ్లకు సంబంధించి స్టేషన్ సీఐ కూడా ప్రమేయం ఉందా అనే విషయమై అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తున్నది.
కాగా, పాగుంట వేంకటేశ్వర స్వామి జాతరలో బతు కుదెరువు కోసం గుడారాలు వేసుకొని వివిధ రకాల వ స్తువులను అమ్ముకునే వారి వద్ద వివిధ శాఖల అధికారులతోపాటు పోలీసులు డబ్బులు వసూలు చేశారు. ఈ కారణంగానే గత నెలాఖరులో కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ను గద్వాల ఏఆర్‌కు అటాచ్ చేశారు. దీంతో అతడు వసూళ్లకు తానొక్కడినే కారణం కాదని, ఎస్ఐ ప్రోద్భలంతోనే చేశానని, తనను వాడుకొని వసూళ్లకు పాల్పడిన ఎస్ఐపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తన ఒక్కడిపైనే చర్యలు తీసుకుంటే స్టేషన్లో ఇప్పటివరకు జరిగిన అక్రమాలన్నింటినీ వెలుగులోకి తెస్తానని హెచ్చరించాడు. తనను వాడుకుని అక్రమ వసూళ్లకు పాల్పడిన ఎస్ఐపై కూడా చర్యలు తీసుకోవాలని లేదంటే ఎస్ఐ పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రికార్డ్ చేసి పోలీసుల వాట్సప్ గ్రూప్‌ల్లో పెట్టాడని తెలిసింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో డిలీట్ చేయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎస్ఐపై కూడా చర్యలు తీసుకున్నారు.