గద్వాల అర్బన్ : మహా శక్తి పీఠాలలో ఒకటైనటువంటి అలంపూర్ జోగులాంబ దేవి ఆలయ అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా జోగులాంబ ఆలయంతోపాటు గద్వాల సమీపంలోని జములమ్మ, పాగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు పురేందర్ అనే అధికారి ఈఓగా పనిచేస్తున్నారు. ఈ ఆలయాలకు సంబంధించి భక్తులు సమర్పించిన కానుకలు, చెక్కులు, హుండీ డబ్బులకు గత కొన్ని సంవత్సరాలుగా లెక్కా పత్రం లేదు. అతని పలుకుబడిని ఉపయోగించి ఆలయాల్లో ఆడిట్ జరిపించకుండా, దేవస్థానాల డబ్బును కాజేసి పురేందర్ ఆస్తులు కూడబెట్టుకున్నాడని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఆలయ ఈఓకు బ్యాంకు అధికారులు కూడా సహకరించడంతో అతని అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని భక్తులు చెబుతున్నారు. దేవాలయాల్లో కనీస సదుపాయాలు కల్పించకుండా బ్రష్టుపట్టిస్తున్నారని వాపోయారు. ఆలయ ఈఓ అవినీతి బాగోతంపై అధారలతో సహా గద్వాల జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షడు వెంకటేష్ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎస్ఎస్ సోమరాజుకు ఫిర్యాదు చేశారు. ఈఓపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సోమరాజు వెంటనే స్పందించి ఈఓపై విచారణకు అదేశించినట్లు వెంకటేష్ తెలిపారు.