జోగులాంబ గద్వాల: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోశ్ (BM Prakash) అన్నారు. ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో కచ్చితమైన రోగ నిర్ధారణకు ఉపయోగపడే సీటీ స్కాన్ సదుపాయాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హస్పిటల్ రేడియాలజీ ల్యాబ్లో ఉన్న రూ.2.5 కోట్ల విలువైన సీటీ స్కాన్ యంత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. దవాఖానకు వచ్చే రోగులకు నాణ్యమైన రోగ నిర్ధారణ సేవలను అందించడానికి అత్యాధునిక కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (CT) స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రోగులకు నాణ్యమైన, కచ్చితమైన రోగనిర్ణయ సేవలు అందించవచ్చన్నారు. సూక్ష్మమైన లోపాలను కూడా ఇది గుర్తించగలదని తెలిపారు. దీని ద్వారా రోగులకు తగిన వైద్య చికిత్సలు వేగంగా అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
గతంలో సీటీ స్కాన్ పరీక్షల కోసం ప్రజలు ఇతర పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు అదే సౌకర్యం స్థానికంగా లభించడంతో ప్రజలు సమయం, ఖర్చును ఆదా చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో ఈ సేవలు లభించడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని విభాగాల వైద్యులు తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన ఉత్తమ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోరారు.
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు పొందాలన్న దృష్టికోణంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సీటీ స్కాన్ యంత్రం ప్రారంభం ద్వారా ప్రజలు స్థానికంగానే నాణ్యమైన వైద్య సేవలు పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు. సాధారణంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మాత్రమే ఉండే అత్యాధునిక సీటీ స్కాన్ యంత్రాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభిస్తునట్లు తెలిపారు. ఇది ప్రజల ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సీటీ స్కాన్ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల ప్రజలు బయటకు వెళ్లకుండా, సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకుంటూ, అవసరమైన వైద్య నిర్ధారణ సేవలు స్థానికంగానే పొందగలుగుతారని తెలిపారు. పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గనుందని, ఈ సౌకర్యాన్ని ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, హాస్పిటల్ సూపరిడెంట్ ఇందిర, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.