ప్రభుత్వ జాబ్ సాధించేందుకు సన్నద్ధమవుతున్న యువత
ఉచిత శిక్షణతో అండగా నిలుస్తున్న సంస్థలు
ముందుకొచ్చిన శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్
కోచింగ్‌కు హైదరాబాద్‌కు వెళ్లకుండా ఇక్కడే ఏర్పాట్లు
కష్టపడి భవితను అందుకోవాలంటున్న నిపుణులు
మహబూబ్‌నగర్, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో జోష్ నెలకొన్నది. ఎలాగైనా కష్టపడి చదివి ఉద్యోగం సాధించేందుకు యువత సిద్ధమవుతున్నది. ఇందుకోసం కోచింగ్ సెంటర్లలో చేరేందుకు సంసిద్ధులవుతున్నారు. ఈ క్రమంలో వారు ఉన్న ఊళ్లోనే ఉచితంగా శిక్షణ ఇచ్చి అండగా నిలబడేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తల్లిదండ్రుల పేరిట ఏర్పాటు చేసిన శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఈ ట్రస్ట్‌ను మంత్రి కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షిత నిర్వహిస్తున్నారు. పాలమూరు నియోజకవర్గంలోని 2 వేల మందికి కోచింగ్ ఇవ్వనున్నారు. కోచింగ్‌తో పట్టు సాధించి ఉద్యోగాలు దక్కించుకొని బంగారు భవితకు అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులంతా పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఒకేసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రకటనతో నిరుద్యోగుల్లో జోష్ కనిపిస్తున్నది. అయితే, కోచింగ్ కోసం చాలా మంది హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు స్థానికంగానే కోచింగ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు ఆన్లైన్లో కోచింగ్ తీసుకుని ఉద్యోగాల వేటకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక స్పృహ ఉన్న కొందరు వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులున్న నిరుద్యోగులకు కోచింగ్ ఇస్తున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ కూడా నిరుద్యోగులను ఆదుకునేందుకు సిద్ధమైంది.
ఉద్యోగాలే ఉద్యోగాలు..
రాష్ట్రవ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడంతోపాటు 80,039 కొత్త పోస్టులు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 4,429 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జోగుళాంబ జోన్ స్థాయిలో 2,190 ఉద్యోగాలకు ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు పోటీ పడనున్నారు. మరోవైపు మల్టీ జోన్ 2 (జోగుళాంబ, యాదాద్రి, చార్మినార్) పరిధిలో 6,370 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని నిరుద్యోగులు వారి వారి జిల్లా పోస్టుల కోసం ప్రయత్నం చేస్తూనే.. అటు జోన్ స్థాయి, ఇటు మల్టీ జోన్ స్థాయిలోని 8,560 పోస్టులకు పోటీ పడనున్నారు. ఒకేసారి ఇన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులు కోచింగ్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పర్యాటక, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తల్లిదండ్రుల పేరిట ఏర్పాటు చేసిన శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోచింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ట్రస్ట్‌ను మంత్రి కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షిత నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని 2 వేల మంది నిరుద్యోగులకు అత్యుత్తమ కోచింగ్ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
నాణ్యమైన శిక్షణ ఇస్తాం..
శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వ దవాఖానలో రోగుల తరఫు బంధువులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించాం. అలాగే క్వారంటైన్లో ఉన్న వారికి ఇంటి వద్దే భోజనం అందించాం. చాలా మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు సైతం అందించాం. ఇప్పుడు ప్రభుత్వం భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయడంతో నిరుద్యోగులకు చక్కని కోచింగ్ అందించాలని నిర్ణయించాం. గత ఏడాదే నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేద్దామనుకున్నాం. కొవిడ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన విన్నర్ పబ్లికేషన్స్ ఫ్యాకల్టీతో కోచింగ్ ఇప్పిస్తాం. గ్రూప్-2, గ్రూప్-3 కోసం వెయ్యి మందికి, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మరో వెయ్యి మందికి కోచింగ్ ఇస్తాం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను నిరుద్యోగులకు తెలియజేస్తాం. ఉద్యోగాల కోసం సీరియస్‌గా ప్రిపేరయ్యే వారికి టెస్ట్ నిర్వహించి ఎంపికచేస్తాం. ఎస్సై, కానిస్టేబుల్ కోసం ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కోసం కూడా శిక్షణ అందిస్తాం. ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వి.శ్రీహిత, చైర్పర్సన్, శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్, మహబూబ్‌నగర్
హైదరాబాద్ స్థాయి కోచింగ్..
శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రూప్-2, గ్రూప్-3, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 2 వేల మంది నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ
ఇవ్వడంతోపాటు స్టడీ మెటీరియల్ కూడా అందించనున్నారు. కోచింగ్ కోసం వచ్చే అభ్యర్థులందరికీ నిత్యం ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు
చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన అత్యుత్తమ శిక్షకులతో కోచింగ్ ఇప్పించనున్నట్లు శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ కో చైర్పర్సన్ శ్రీహర్షిత తెలిపారు. ప్రైవేటులో ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకుంటే ఎలా ఉంటుందో.. ఆ స్థాయిలో శిక్షణ ఇప్పిస్తామని వివరించారు.