హైదరాబాద్ : సీపీఐ అగ్ర నాయకులు, కామ్రేడ్ నల్లమల గిరిప్రసాద్ సతీమణి నల్లమల కమలాదేవి (87) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లో కన్నుమూశారు. కమలాదేవి భౌతిక కాయాన్ని ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు బంధువులు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఆమె పెద్ద కుమార్తె నివాసంలో ఉంచనున్నారు.
సాయంత్రం 5-00 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా కామ్రేడ్ నల్లమల కమలాదేవి మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు. నల్లమల కమలాదేవి తన భర్త గిరిప్రసాద్‌కు అనునిత్యం వెంట నడిచి ఆయన పోరాటంలో భాగస్వాములయ్యారని అన్నారు. వారి కుటుంబసభ్యులతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని అన్నారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.