జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య
జడ్చర్లటౌన్, మార్చి 13 : నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య తెలిపారు. జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో జడ్చర్ల నియోజకవర్గంలోని పేద నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ నిర్వహించనున్నట్లు చెప్పారు. నిష్ణాతులైన వారిచే కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలపై కోచింగ్ ఇచ్చిన ట్లు చెప్పారు. అలాగే గ్రామాల్లో నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటు, మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు గుర్తుచేశారు. సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కోచింగ్ సెంటర్ ను నియోజకవర్గంలోని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొంగళి జంగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.మురళి, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, చైతన్యగౌడ్, హరితయాదవ్, రమేశ్, నాయకులు వీరేశ్, ఆండాళమ్మ, విజయ్ ఉన్నారు.