గద్వాల, నవంబర్ 1: ఉమ్మడి రాష్ట్రంలో నర్సింగ్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నర్సింగ్ విద్యకు ప్రాముఖ్యత ఇచ్చారని మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ రాధ, జగిత్యాల నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యావతి పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం వారు మాట్లాడారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 13నర్సింగ్ కళాశాలలు మంజూరు చేసిందన్నారు. గద్వాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే స్థల పరిశీలన చేశామన్నారు. చివరిగా అఫ్లియేషన్ పరిశీలన చేశామని చెప్పారు. ఇక్కడ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నాయన్నారు. విద్యార్థినులకు అవసరమైన తరగతి గదులతో పాటు, వసతి గృహ సౌకర్యాలు బాగున్నాయన్నారు. ఇప్పటికే కళాశాలకు ప్రభుత్వం టీచింగ్ స్టాఫ్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నర్సింగ్ కళాశాల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ ప్రాంత విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇక్కడ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత విద్యార్థినులకు దూరభారం తగ్గుతుందన్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేయడం వల్ల విద్యార్థినులు వృత్తిలో స్థిరపడటానికి అవకాశం ఉందన్నారు. ఈ కోర్సు చదవడం వల్ల ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుందన్నారు. 100సీట్లతో కళాశాల ప్రారంభమవుతుందని చెప్పారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థినికి స్కాలర్షిప్ వస్తుందని, మెరిట్ ప్రకారం సీట్ల భర్తీ చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సహకారంతో జిల్లాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు ద్వారా విద్య, వైద్యానికి కేంద్రంగా గద్వాల మారనున్నదన్నారు. అనంతరం దౌదర్పల్లి దర్గా సమీపంలో నర్సింగ్ కళాశాల కోసం కేటాయించిన స్థలంతోపాటు అక్కడే మెడికల్ కళాశాల, దవాఖాన కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లాకేంద్రంలో ఉన్న కళాశాల భవనం, వసతిగృహం, ల్యాబ్‌లు తదితర వాటిని పరిశీలించారు. సమావేశంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కమల, వైస్ ప్రిన్సిపాల్ సత్యప్రియ, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, నాయకులు రమేశ్‌నాయుడు, కురుమన్న, సోమనాద్రి విద్యాసంస్థల అధినేత భాస్కర్‌రెడ్డి, బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.