గద్వాల, సెప్టెంబర్ 12 : ప్రజల అండే తనకు కొండంత ధైర్యమని, ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అండతోనే 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామని, వారి అండ ఉన్నంత కాలం ఎన్ని కేసులు పెట్టినా భరిస్తామని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే బండ్ల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో స్టే రావడంతో మంగళవారం జిల్లాకేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యేకు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జములమ్మ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. గద్వాల మండలం అనంతపురం స్టేజీ నుంచి వేల వాహనాలతో ర్యాలీ ప్రారంభమై జిల్లాకేంద్రంలోని పలు వీధుల గుండా కొనసాగింది. అనంతరం పాత బస్టాండ్‌లో సమావేశం ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ గజమాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి డీకే అరుణ ప్రజాస్వామ్య యుద్ధంలో పోరాడ లేక కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రజల ముందు అభాసుపాలైందన్నారు.
ఆమె పాలనా వైఫల్యాల పాపమే నేడు నడిగడ్డకు శాపమైందన్నారు. మరికొందరు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పదవిని అనుభవిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, వారి తీరు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లు ఉందని దుయ్యబట్టారు. ఏరోజు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోని వారు నేడు వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. నాన్‌లోకల్ నాయకులు గద్వాలలో పెత్తనం చేయడానికి చూస్తున్నారని, వారికి ఒకసారి అధికారమిస్తేనే నడిగడ్డను అధోగతి పాలు చేశారన్నారు.
గతంలో వాళ్లు చేసిన అక్రమాలకు తనను ఇబ్బంది పెట్టారని, డీకే అరుణకు మూడుసార్లు అధికారమిస్తే ఆమె అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజలకు దూరమయ్యారని వివరించారు. బంగ్లా నాయకుల అక్రమాలను భరించలేక ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. బీజేపీ మతతత్వపార్టీ అని, కులమతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతమందికి పదవులు ఇస్తే.. అన్నం పెట్టిన వాడికి సున్నం పెడుతూ ఆయననే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఇప్పుడొచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టూరిస్టు నాయకులతో గద్వాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ర్యాలీ అనంతరం ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆయన తల్లి, భార్య దిష్టి తీసి మంగళహారతులిచ్చి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, రాష్ట్రవినియోగదారుల ఫోరం చైర్మన్ తిమ్మప్ప, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్‌గౌడ్, నాయకులు సాయిసాకేత్రెడ్డి, చెన్నయ్య, వెంకట్రాములు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.