Gadwal | జోగులాంబ గద్వాల : గ్రామస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి కీలకంగా మారుతోందని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల్ మండలం అనంతపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొని భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, రిజిస్ట్రార్లు, దరఖాస్తుదారులకు ఇస్తున్న రశీదు, ఏ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారి భూ సంబంధిత సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కార మార్గాలపై సూచనలు ఇచ్చారు. అధికారులకు తగిన మార్గదర్శకాలు తెలియజేసి, సమస్యలు వేగంగా పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. భూ భారతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి భూమి సంబంధిత సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో జూన్ 3 నుండి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. భూ సమస్యలు ఉంటే సంబంధిత ఫారం నింపి అధికారులకు అందజేయాలని రైతులకు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం అన్ని దరఖాస్తులు స్వీకరించేంత వరకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతుల భూ సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఫారాల స్వీకరణ నుండి ఆన్లైన్ నమోదు వరకు ప్రతి దశలో బాధ్యతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో జరిగే భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ,ఆర్డీఓ అలివేలు, గద్వాల తహసీల్దార్ మల్లికార్జున్,రెవిన్యూ సిబ్బంది, రైతులు,తదితరులు పాల్గొన్నారు.