విద్యార్థుల ఉజ్వల భవితకు చదువే ఆధారం.. అందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఉచితంగా మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాగి జావ అందించేందుకు శ్రీకారం చుట్టగా.. తాజాగా నోట్ పుస్తకాలను సైతం పంపిణీ చేస్తున్నది. 6 నుంచి పదో తరగతి వరకు తొలిసారిగా అమలు చేస్తున్నది. 6 నుంచి 8 వరకు 7 చొప్పున, 9, 10 విద్యార్థులకు 14 చొప్పున అందజేస్తున్నది. వనపర్తి జిల్లాకుగానూ మొత్తం 95 నోట్ బుక్కులు వచ్చాయి. దీంతో పేద విద్యార్థులకు ఊరట లభించింది. నోట్‌బుక్ కవర్ పేజీపై సీఎం కేసీఆర్ ఫొటోతో పాటు మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి అంటూ ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’, చివరి పేజీపై విద్యా శాఖ మంత్రి సబిత ఫొటోతోపాటు సర్కారు బడుల ప్రగతి దృశ్యాలతో‘ఫెసిలిటీస్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్’ అన్న క్యాప్షన్‌తో ముద్రించి ఉన్నాయి.
పెబ్బేరు, జూలై 3 : పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతోపాటు సకల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తుండగా.. తాజాగా నోటుపుస్తకాలను సైతం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది రాగిజావతోపాటు నోటుపుస్తకాల పంపిణీని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.
సర్కారు బడుల బలోపేతంతోపాటు పేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 2023-24 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యావిధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. మనఊరు-మనబడి కింద కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను తీర్చిదిద్దడం, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ తరగతుల నిర్వహణ వంటివి ఇందులో భాగమే. తాజాగా పాఠ్యపుస్తకాలతోపాటు నోటుపుస్తకాలను సైతం ఉచితంగా పంపిణీ చేయడంతో విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలుగుతున్నది. ఏటా ఒక్కో విద్యార్థి తల్లిదండ్రులు నోట్ పుస్తకాల కోసం రూ.400 నుంచి రూ.900 దాకా ఖర్చు చేసేవారు. ఇప్పుడు ఆ డబ్బు ఆదా అయినట్లయ్యింది.
6-10 తరగతుల విద్యార్థులకు..
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6-10 తరగతుల విద్యార్థులకు ఉచితంగా నోటుపుస్తకాల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేసింది. 6-8 తరగతి విద్యార్థులకు 7 చొప్పున, 9, 10 విద్యార్థులకు 14 చొప్పున నోటుపుస్తకాలను అందజేస్తున్నది. 18* 29.5 సెంటీమీటర్ల సైజులో 200 పేజీ లు ఉన్న నోటు పుస్తకాల్లో కొన్ని గీతలతో కూడినవి, మరికొన్ని తెల్లటి పేజీలవిగా విభజించింది. ఒక్కో విద్యార్థికి రెండు రకాల నోటు పుస్తకాలను అందిస్తారు. ఈ నోటుపుస్తకం ధర బహిరంగ మార్కెట్లో రూ.60 నుంచి రూ.65 దాకా ఉంటుంది. పుస్తకం కవర్ పేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోతోపాటు మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి అంటూ ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ అనే క్యాప్షన్ ఉంటుంది. చివరి పేజీ మీద విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫొటోతోపాటు సర్కారు బడుల ప్రగతి ఫొ టోలు ‘ఫెసిలిటీస్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్’ అనే క్యాప్షన్‌తో ముద్రించి ఉంటుంది.
జిల్లాకు 2.37లక్షల పుస్తకాలు అవసరం..
జిల్లా మొత్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి 2లక్షల 37వేల పుస్తకాలు అవసరమని అధికారులు తేల్చారు. ఇప్పటివరకు గీతల నోటు పుస్తకాలు 40,361, ప్లేన్ నోటుపుస్తకాలు 54,750 మొత్తంగా 95,111 జిల్లాకు చేరాయి. వీటిలో 63వేల నోటుపుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేశారు. జిల్లాకేంద్రం నుంచి అన్ని మండలాలకు వీటిని సరఫరా చేయగా ఎంఈవోల ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అప్పజెప్పారు. కాగా జిల్లాకు ఇంకా లక్షా 42వేల నోటుపుస్తకాలు రావాల్సి ఉంది.
ప్రభుత్వ బడుల్లో చేర్పించండి
ప్రస్తుతం ప్రభుత్వ బడులు సకల సౌకర్యాలతో మెరుగైన విద్యాభోదనకు నిలయంగా మారాయి. విద్యార్థుల తల్లిదండ్రులపై నోటుపుస్తకాల భారం పడకుండా ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారంగా రాగిజావను కూ డా అందిస్తున్నాము. ఉమ్మడి పెబ్బేరు మండలాని కి 23వేల నోటుపుస్తకాలు అవసరముండగా ఇ ప్పటి వరకు 9వేల పుస్తకాలొచ్చాయి. మిగితావి రాగానే విద్యార్థులందరికీ పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తాం. – జయరాములు, ఎంఈవో, పెబ్బేరు
ఉపయోగకరంగా ఉన్నాయి
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నోటుపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంది. అన్ని సబ్జెక్టులకు నోట్స్‌లు ఇస్తామని చెప్పారు. దీంతో మాకు కొనే భారం తగ్గింది. బడుల్లో మధ్యాహ్న భోజనంతోపాటు తాజాగా ఇస్తున్న రాగిజావ కూడా ఎంతో బాగుంది.
– నందిని, విద్యార్థిని, 9వ తరగతి
ఖర్చు మిగిలింది
పదో తరగతిలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి నోటు పుస్తకాలు కొనాలంటే సుమారు రూ.900 దాకా ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఉచితంగా వీటిని ఇస్తుండడం వల్ల మా తల్లిదండ్రులకు ఆ భారం తప్పింది. విద్యాభోదన కూడా బాగుంది.
– ప్రకాశ్, విద్యార్థి, 10 తరగతి