కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు తీపికబురు అందించింది. శనివారం నుంచి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేలా వెసులుబాటు కల్పించారు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కలిగిన కార్డు చూపించి ప్రయాణించవచ్చు. దీంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 80వేల మందికి పైగా మహిళలకు లబ్ధి చేకూరనున్నది.
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 8 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విధివిధానాలను రూపొందించి అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం మధ్యాహ్నం 2గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ ఇక నుంచి ప్రయాణించవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రయాణ సమయంలో కేవలం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కలిగిన కార్డు ఉంటే సరిపోతుంది. వీటితోపాటు స్థానిక ధ్రువీకరణ పత్రాలను చూయించాల్సి ఉంటుంది. తెలంగాణలోని మహిళలకు మాత్రమే ఈ ప్రయాణం వర్తిస్తుంది. ప్రయాణించే మహిళకు జీరో టిక్కెట్ వర్తించనున్న ది. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ సరిహద్దుల వరకు మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అమలయ్యే ఈ కా ర్యక్రమాన్ని మహబూబ్‌నగర్‌లో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అమల్లోకి రానున్నది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 10 డిపోలు ఉండగా, వీటి పరిధిలో 845 బస్సులు రోజూ రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం 2.50లక్షల మంది ప్రయాణికును గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. అయితే వీరిలో సుమారు 80వేల మంది వరకు మహిళా ప్రయాణికులున్నారు. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో అమలు చేస్తారు. రీజియన్‌లోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్, కొల్లాపూర్, కోస్గి డిపోల్లో ఎక్స్‌ప్రెస్ బస్సు లు 268 ఉండగా, పల్లెవెలుగు 455 బస్సులున్నాయి. ఇవి రీజియన్‌లోని ఉమ్మడి 5జిల్లాల పరిధిలో ప్రతి మార్గంలో నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్ రీజియన్‌లోని అన్ని డిపోల్లోని ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు లో ఈ సదుపాయం శనివారం మధ్యాహ్నం నుంచి అమల్లోకి రానున్నది. రోజుకు రీజియన్‌లోని 10 డిపోల నుంచి ఆర్టీసీకి సగటున రూ.1.30 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే సుమారు 40 శాతం మహిళా ప్రయాణికుల నుంచి సుమారు రూ.50లక్షల వరకు సంస్థ ఆదాయం కోల్పోనున్నది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి రీజియన్‌లోని అన్ని డిపోల పరిధిలో ఈ పథకం కింద మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. ఈ మేరకు కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. మధ్యాహ్నం 2గంటలకు మహబూబ్‌నగర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నాం.