కల్వకుర్తి, జూన్ 9 : కల్వకుర్తి పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్‌కు చేసిన శంకుస్థాపన వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పాఠశాల ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థుల విద్యాభ్యాసానికి అటంకం కలగడమే కాకుండా, విద్యార్థులకు ఆటస్థలం కుచించుకుపోతుందని విద్యాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తామని ప్రభుత్వాలు చెబుతూ.. మరో పక్క పాఠశాల ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడమేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓపెన్ జిమ్ ఏర్పాటు వల్ల అతి ప్రాచీన చరిత్ర కలిగిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల చరిత్ర క్రమక్రమంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని విద్యాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గొప్ప చరిత్ర కలిగిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల
కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చాలా గొప్ప చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్రం రాక ముందే ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో ఉదయం పాఠశాల, మధ్యాహ్నం జూనియర్ కళాశాల కొనసాగింది. ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పింది. కాలక్రమేనా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంలో ఇదే మైదానంలో పాఠశాల, కళాశాలకు వేర్వేరు భవనాలు నిర్మించారు. ఇప్పుడు ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల వేర్వేరు భవనాల్లో కొనసాగుతున్నాయి. రెండింటిని విభజిస్తూ గోడను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఉన్నత పాఠశాలకు మైదానం కుచించుకుపోయింది. ఉన్న స్థలంలోనే విద్యార్థులు క్రీడలు ఆడుతున్నారు.
ఉన్నత పాఠశాల మైదానంలో శంకు స్థాపన
ఈనెల 5వ తేదీన ఉన్నత పాఠశాల మైదానంలో రూ.10లక్షల అంచనా వ్యయంతో నిరించనున్న ఓపెన్ జిమ్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అప్పుడు కళాశాలకు చెందిన హెచ్ఎం, అధ్యాపకులు జిమ్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థులు విద్యాభ్యాసానికి. క్రీడలకు ఆటంకం కలుగుతుందని, జిమ్ ఏర్పాటు వల్ల పాఠశాలలోని మౌలిక వసతులు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పాఠశాలకు రక్షణ లేకపోవడం వల్ల మూత్రశాలలను పాడుచేస్తున్నారని, పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నారని, ఇక్కడ జిమ్ ఏర్పాటు చేస్తే పాఠశాల ఉనికికే ప్రమాదం సంభవిస్తుందని చెప్పినా పట్టించుకోకుండా జిమ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీఈవో నుంచి మౌఖిక అనుమతులు..
ప్రభుత్వ పాఠశాలల్లో చిన్న చెట్టును తీసివేయాలన్నా..పాత సామాన్లు తొలగించాలన్నా..చివరకు శిథిలమైన భవనాన్ని కూల్చివేయాలన్న ఆ శాఖ ఉన్నతాధికారులు అనుమతి తప్పనిసరి. ఆలాంటిది పాఠశాల ఆవరణలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ఇదే విషయాన్ని ఎంఈవో శంకర్ నాయక్‌ను అడిగితే సెలవులో ఉన్నానని ఈ విషయం గురించి తెలియదని సమాధానం ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్‌కు అడిగితే డీఈవో మౌఖికంగా అనుమతి ఇచ్చారని చెప్పారు. జిమ్ ఏర్పాటు చేసుకోవచ్చని డీఈవో నుంచి ఏదైన ప్రోసిడింగ్ ఉందా అని అడిగితే అలాంటిదేమి లేదని కమిషనర్ సమాధానం ఇచ్చారు.
ఒకటి రెండు చోట్ల తప్పా..
కల్వకుర్తి పట్టణంలో 10 వరకు ఓపెన్ జిమ్‌లు ఉన్నాయి. ఇందులో రెండు మూడు తప్పా మిగిలిన జిమ్‌లు పెద్దగా ఉపయోగంలో లేవు. వీటికి నిర్వహణ లోపించడం వల్ల ఆదరణ కరువైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న జిమ్‌లకు మౌలిక వసతులు కల్పించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకుండా కొత్తగా అది ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేయడమేమిటని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. జిమ్‌ల ఏర్పాటు కాంట్రాక్టర్‌కు ఉపయోగం తప్పా..మరేమి ఉండదని పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిమ్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.