కొత్తకోట, మార్చి 24 : గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన తమకు ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మాజీ సర్పంచులు కొత్తకోట పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాల్లోని సర్పంచుల పదవీకాలం ముగిసి నేటికీ 14 నెలలు గడుస్తున్నా స్థానిక ఎన్నికల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో సర్పంచులుగా ఉండి చేసిన అభివృద్ది పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా తీవ్రంగా వేధిస్తున్నదని ఆరోపించారు. ఈ విషయమై బీఆర్ఎస్ నాయకులు గొంతెత్తి ప్రశ్నించినా? ధర్నా చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల చేత అక్రమ అరె స్టులు చేయించి అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాలను ప్రత్యేక అధికారుల చేతిలో పెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. గ్రామంలోని వివిధ సమస్యలను ప్రజలు ప్రత్యేకాధికారుల దృష్టికి తీసుకువెళ్తే వారు పట్టించుకోవడం లేదని, దీంతో గ్రా మాల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేసి ందన్నారు.
అంతేకాకుండా రెండు రోజుల కిందట కురిసిన అకాల వడ గండ్ల వర్షానికి మండలంలోని కొన్ని వందల ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లిందని, ఈ విషయమై రైతులు మొరపెట్టుకుంటున్నా కూడా కాంగ్రెస్ పార్టీలోని ఏ ఒక్క నాయకుడు రైతు వంక చూడలేదని, వారి సమస్యను పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడంతోపాటు త్వరలో స్థాని క సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అనంతరం వనపర్తికి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, ఉమ్మడి జిల్లా సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, అయ్యన్న, శ్రీనువాసులు జీ, పరమేశ్, నెహ్రూ, రాజు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.