నారాయణపేట, జూన్ 15 : 18 నెలల కాంగ్రెస్ పాలనలో నారాయణపేట నియోజకవర్గంలో కబ్జాలు, కహానీలు తప్పా ఒకటంటే ఒకటి కొత్తగా అభివృద్ధి పని జరగలేదు.. సరి కదా తాను మంజూరు చేయించుకొచ్చిన వాటిని కూడా ఇకడి నుంచి పోకుండా కాపాడుకోలేక పోవడం చాలా బాధాకరమని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి విమర్శించారు. నారాయణపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతులు తీసుకుని వచ్చిందే తానేనని ఇటీవల చెప్పుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే, తీరా నారాయణపేట నుంచి దవాఖాన తరలించిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా గత ఎమ్మెల్యేనే జిల్లా దవాఖానను దూరంగా ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే చెప్పడం చూస్తుంటే ‘మంత్రం పని చేస్తే తనది.. పని చేయకుంటే నాది కాదు నీది’ అన్నట్లుగా ఉందన్నారు.
‘ఎస్’ గౌరవంగా చెప్పుకుంటున్న జిల్లా దవాఖాన తీసుకువచ్చిందే తానేనని, మెడికల్ కళాశాల తీసుకువచ్చిందే కూడా తానేనని అన్నారు. నారాయణపేట పరిసర ప్రాంతాల్లో ఎకడా మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, జిల్లా దవాఖాన ఏర్పాటుకు పెద్ద మొత్తంలో అనువైన స్థలాలు లేకపోవడంతో అప్పంపల్లి వద్ద అనుకూలంగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేయించినట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా దవాఖానకు రూ. 56కోట్లు మంజూరు చేయిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 05-07-2023న జీవో నెంబర్ 81ద్వారా ఉత్తర్వులు జారీ చేయించడం జరిగిందన్నారు.
అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా జిల్లా దవాఖానకు శంకుస్థాపన చేయించి నిర్మాణ పనులను వేగవంతం చేయించినట్లు చెప్పారు. అంతేకాకుండా నారాయణపేట మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేయిస్తూ తేదీ 16.09.2023 జీవో నెంబర్ 162 ద్వారా ఉత్తర్వులు జారీ చేయించానన్నారు. ప్రస్తుతం ఉన్న ఏరియా దవాఖాన స్థానంలో ప్రసవ, చిన్నపిల్లల దవాఖాన కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు లేఖ కూడా అందజేసినట్లు తెలిపారు.
అందుకే ప్రస్తుత ప్రభుత్వంలో మంజూరైన ప్రసవ, చిన్నపిల్లల దవాఖానని పట్టణంలో అందరికీ సౌకర్యంగా ఉండే ఏరియా దవాఖాన స్థానంలోనే నిర్మించాలని ప్రజల తరఫున డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఉన్న ఫలంగా నారాయణపేటలో కనీసం ఓపీ సేవలు కూడా లేకుండా మొత్తం దవాఖానని తరలించడం చాలా దారుణమని, శిథిలావస్థకు చేరిన ఏరియా దవాఖానని పకన పెట్టి, తాతాలిక భవనంలో ఓపీ సేవలు కొనసాగిస్తే పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.
గత 18 నెలల కాలంలో ఒక రూపాయి కూడా కొత్తగా తీసుకొచ్చి అభివృద్ధి చేసిన 9దాఖలాలు లేవు సరికదా తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో తీసుకువచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఇతర నియోజకవర్గాలకు తరలి వెళ్తుంటే కనీసం ఆపకపోవడం ఎమ్మెల్యే చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మంత్రులు, అధికారులు ఉండేందుకు కొత్త జిల్లాలో ప్రత్యేకంగా అతిథి గృహం (గెస్ట్ హౌస్) లేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.4 కోట్లతో ఆధునాతన అతిథి గృహం (గెస్ట్ హౌస్) నిర్మించేందుకు గాను సింగారం క్రాస్ రోడ్లో స్థలం ఎంపిక చేసి, నిధులు కూడా మంజూరు చేయించి, టెండర్ కూడా వేయించడం జరిగిందన్నారు. ఈ అతిథి గృహాన్ని (గెస్ట్ హౌస్) రద్దు చేసి కొడంగల్ నియోజకవర్గానికి తరలించుకొని వెళ్తే ఎమ్మెల్యే అడ్డు చెప్పుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు.
కోయిలకొండ మండలం రామకొండ ఆలయ అభివృద్ధికి తాను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో తీసుకొచ్చిన రూ.10 కోట్ల నిధులు వెనకి వెళ్తే ఎమ్మెల్యే అడ్డుకోకపోవడం, 18 నెలలు అవుతున్నా ఎస్పీ ఆఫీసు పనులను, స్టేడియం నిర్మాణ పనులను ఇప్పటివరకు మొదలు పెట్టకపోవడం, మరికల్లో వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు కోసం స్థలం ఎంపిక చేసి పెట్టినప్పటికీ, దానిని మంజూరు చేయించుకొని రాకపోవడం ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యం అని ఆరోపించారు.
నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్ల వంటివి అని, కొడంగల్‌కు ఎన్ని నిధులు వస్తాయో అన్ని నిధులు నారాయణపేట కూడా ఇస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం మాత్రం ఒక కన్నుకే పెద్ద పీట వేస్తూ రెండో కన్నును పొడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ప్రశ్నించకపోవడం సరైనది కాదన్నారు. ఇక సైనిక్ సూల్ కోసం లోకపల్లి వద్ద 50 ఎకరాల స్థలం కేటాయించి, రెండు సార్లు కేంద్రానికి మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి విన్నవించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు సైనిక్ సూల్ మంజూరు చేయకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మరి కోటకొండ, కానుకుర్తి, గార్లపాడ్ మండలాలను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో తన హయాంలో మంజూరు చేసి, ప్రారంభించిన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను నారాయణపేట నుంచి తరలిస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నారాయణపేటలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, కళాశాలను తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
ధన్వాడ, జూన్ 15 : ధన్వాడ ఆడబిడ్డలమంటూ అధికారం అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు 18 నెలల కాలంలో రెండు సార్లు చెరువులోని ఒండ్రుమట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మండలంలోని చర్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విపలమైందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ఈ ప్రభుత్వం అవస్థలు పడుతుందన్నారు. ఎన్నికల ముందుకు దివ్యాంగులు, వృద్ధులకు ఇస్తున్న పింఛన్లు పెంచుతామని, మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని, కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పి 18 నెలలుగా గడిచినా ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయలేక విమర్శలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. రైతులు, ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో నూకలు చెల్లడం ఖాయం అన్నారు. అంతకుముందు విద్యుదాఘాతంతో మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కరుణాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ ఎం.వెంకట్‌రెడ్డి, నాయకులు మురళీధర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మల్లప్ప, సునీల్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్, భగవంత్‌రెడ్డి, పూర్యానాయక్, నర్సింహారెడ్డి, శాంతకుమార్, ఇర్ఫాన్, నాసర్, దామోదర్‌రెడ్డి, రమేశ్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.