నాగర్‌కర్నూల్, ఆగస్టు 2 : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలనకు బదులుగా ప్రతీకార (కక్షసాధింపు) పాలన నడిపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పసలేని బడ్జెట్ ను విడుదల చేసి పేదల నడ్డి విరుస్తున్నారని, అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. రైతులు, ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి రైతులకు రైతుబంధు నిలిపివేసి రుణమాఫీ చేస్తున్నారన్నారు. రైతు రుణమాఫీ విషయంలో రేషన్‌కార్డు ప్రామాణికమని ఒకరు, మరోవిధంగా మరో మంత్రి మాట్లాడుతూ పొంతనలేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
రేషన్‌కార్డులు ఉన్నవారికే రుణమాఫీ అని ఒకరు, లోన్‌కు ఇంట్రెస్ట్‌కు సంబంధం పెట్టి కొర్రీలు పెడుతున్నారని, రైతు లు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తలలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే రైతుల రుణమాఫీ చేయాలే కానీ ఆంక్షల పేరిట రైతు పొట్టకొట్టొదన్నారు. ఆరు గ్యా రెంటీల పేరుతో అధికారంలో వచ్చిన ప్రభుత్వం అవి దిక్కులేకుండా పోయాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ ఒక్కటి సక్రమంగా అమలు కావడం లేదని, వందరోజుల్లో అమలు చేస్తామన్న హామీలన్నీ ఉత్తివే అయ్యాయన్నారు. మహిళలకు రూ.2500 ఎప్పుడిస్తారని, ముసలవ్వలకు రూ.4 వేల పింఛన్ ఎక్కడ అని, నిరుద్యోగ భృతి ఊసేలేదన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని, రోజుకు నాలుగు హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు లేవని, రైతు భరోసాపై ఇప్పటికీ సరైన విధి విధానాలు రూపొందించలేదని, పాలనను పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనే పనిలో పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తలతిక్క ఆలోచనలు చేసి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, రోజులు లెక్కపెట్టుకుంటున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నామని, గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కా రం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నదని, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం అందరికీ విధితమే అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీశైలం, పులేందర్‌రెడ్డి, చం ద్రశేఖర్‌రెడ్డి, రవి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.