కల్వకుర్తి, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరతోపాటు బోనస్ ఒకేసారి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. అలాగే సన్నాలతోపాటు దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోసన్ చెల్లించాలన్నారు. సన్నాలను అమ్మిన నెలరోజుల్లోగా బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం తీవ్ర ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించిందని, చాలామంది రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారన్నారు. సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు కొక్కిన రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కూడా ధాన్యం విక్రయించిన నెలరోజుల్లోగా ఇస్తామని ప్రకటించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రుణమాఫీ పూర్తి చేయలేక చేతులెత్తేసిన ప్రభు త్వం రైతుభరోసా మాటే మర్చిపోయిందని, రైతులు పెట్టుబడులకు డబ్బులులేక ఇబ్బందులకు గురువుతున్నారన్నా రు. 10నెలల కాలంలోనే రేవంత్ సర్కార్ అట్టర్ ప్లాఫ్ అ యిందని, ప్రజలు పదేపదే కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. మాది రైతుల ప్రభుత్వమని గప్పా లు కొట్టుకుంటున్న రేవంత్ సర్కార్ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో రైతుల ఉసురు తగులుతుందన్నారు.
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఆధారంగా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. రైతులు ధాన్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అంతా సజావుగా సాగుతున్న నేపథ్యంలో.. మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని, పీఏసీసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని తొలగించాలని స్థానిక కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలను మానుకోవాలని హితవుపలికారు. పీఏసీసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని తొలగిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, రైతులకు ఇబ్బందులు కలిగించే పనులు చేపట్టొద్దని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, మధు, సూర్యప్రకాశ్‌రావు, మనోహర్‌రెడ్డి, గోవర్ధన్, శ్రీనివాసులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.