మక్తల్, జూలై 14 : కృష్ణానది ఉరకలేస్తున్నా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు రిజర్వాయర్లను నింపడంలో మంత్రి వాకిటి శ్రీహరి నిర్లక్ష్యం వీడి వెంటనే ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మక్తల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వానకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ సంగంబండ ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వలకు ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు పరిధిలోని చెరువులు చుక్క నీరులేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై నెల సగం దాటిపోయినా నీరు రాకపోవడంతో రిజర్వాయర్లు, చెరువుల కింద పంటలు సాగు చేసే పంటకు పూర్తిస్థాయిలో నీరు అందుతుందా అనే అయోమయంలో రైతులు ఉన్నారన్నారు.
రిజర్వాయర్లు, చెరువులకు సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారని తనకు ఫోన్లు చేసి రైతులు బాధపడుతున్నారని వాపోయారు. గతంలో మాదిరిగానే ఎప్పటికప్పుడు రిజర్వాయర్ నీటిని విడుదల చేసి రైతాంగానికి సాగుకు నీరు అందించాల్సిన మంత్రి, ఇరిగేషన్ అధికారులు అలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందన్నారు. మంత్రి ఇరిగేషన్ శాఖపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి రైతాంగానికి సాగునీటిని విడుదల చేయడంలో దృష్టి సారించాలని సూచించారు.
కేసీఆర్ హయాంలో రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా కృష్ణమ్మకు వరదలు ప్రారంభం కాగానే విడుదల చేసే వారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా కరెంట్, ఎరువులు, విత్తనాలు ఇవ్వడంలోనూ రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటును ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని సూచించారు. దేశంలో ఎక్కడా లేని వి ధంగా కేసీఆర్ హయాంలో రైతులు రైతుబంధు ఇస్తే దాని పేరు రైతు భరోసాగా మార్చి రెట్టింపు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మూడు సార్లు రైతుభరోసాను ఎగ్గొట్టి రైతునోట్లో మట్టికొట్టారన్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఏదో కంటితుడుపు చర్యగా రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తున్నదని, ఎన్నికల తర్వాత దీనిని అటకెక్కించడం ఖాయం అని రైతులు ఈ విషయం గుర్తించి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా మక్తల్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి మంత్రి పదవి రాలేదని, ష్ట్రంలో ముదిరాజుల జనాభా పెద్ద ఎత్తున ఉన్న కారణంగా మంత్రి పదవి వరించిందన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఏదీ ఏమైనా మంత్రి పదవి చేపట్టిన వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని, ముఖ్యంగా రైతులకు సాగునీరు అందించేందుకు రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, నాయకులు అన్వర్ హుస్సేన్, జట్ల శంకర్, మహిమూద్, మన్నాన్, మంగలి నర్సింహ, కృష్ణయాదవ్, శివారెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.