మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 23 : వలసల జిల్లాగా ఉన్న పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చానని.. రాజకీయాలు చేయడానికి రాలేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం సర్‌పై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మిగిలిపోయిన కొన్ని పనులను కాంగ్రెస్ పూర్తి చేయకుండా ఎక్కడిక్కడే నిలిపివేసిందని ఆరోపించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు మిగిలిపోయిన అభివృద్ధి, ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి మహబూబ్‌నగర్ మరింత అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ అధికారంలోకి వస్తే కష్టకాలంలో అండగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. సర్‌పై బీఆర్ఎస్ బీఎల్ఏలు మరింత కష్టపడాలని వలసలు వెళ్లినవారు వచ్చి ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చేలా చూడాలని, విదేశాలో ఉన్నవారు ఆన్లైన్ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర..కేటీఆర్ పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రాజెక్టుల ఎత్తు పెంచాలని చూస్తున్నారని, ఇలా చేస్తే మనకు నీళ్లు వచ్చే పరిస్థితిలేదన్నారు. ఇప్పటికే కర్ణాటక వెళ్లి అక్రమ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలన చేసి వాటిని ఆపాలని కోరినట్లు తెలిపారు. భవిష్యత్‌లో అన్ని అక్రమ ప్రాజెక్టులపై పోరాటం చేస్తామని, అక్రమ ప్రాజెక్టులు నిలిపివేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.
గతంలో రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీట ర్లు పెట్టాలని చూస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పడు పోతుందో రైతులకు తెలియడం లేదన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు ఎవరు భయపడొద్దని, స్థానిక సమస్యలపై పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి పార్టీ పటిష్టతకు అందరూ పనిచేయాలని, గతంలో జరిగిన పొరపాట్లను సరి చేసుకొని ముందు కు వెళ్లాలని సూచించారు. అనంతరం రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్, రాష్ట్ర నేత అభిలాష్‌రావు సర్ ప్రాధాన్యతను వివరిస్త్తూ అర్హులైన ఓట్ల ను తొలగించకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు దేవెందర్‌రెడ్డి, కరుణాకర్‌గౌడ్, ఆంజనేయులు, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో యువతను బీజేపీ ప్రభు త్వం అణిచివేస్తూ దాడులు చేస్తుందని, విద్యార్థులు చదివితే సీటు వస్తుందనే నమ్మకం లేకుండా పోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీల్లో విద్యార్థులు చేపట్టిన నిరసనకు మద్దతుగా గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పేపర్ లీకేజీలతో పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటి వరకు 150సార్లు పేపర్లు లీక్‌లు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల మళీ ్లమళ్లీ పేపర్ లీక్ జరుగుతూనే ఉంటున్నాయన్నారు. ఢిల్లీలో విద్యార్థులు, యువకులపై లాఠీచార్జి జరుగుతున్నా బీజేపీ, కాంగ్రెస్ పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాక్రోచ్ పార్టీ ఆందోళనలో విద్యార్థులు, యువత కదిలిరావడంతో రాహుల్‌గాం ధీ హడావుడిగా మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు రాష్ర్టాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయకపోవడంతో పేద వి ద్యార్థులు ఆందోళనలో ఉన్నారన్నారు. కేటీఆర్ కూడా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి విద్యార్థి యువతలకు మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు పేపర్ లీక్ చేసేవారికి కఠిన శిక్ష పడేవరకు పోరాటం చేస్తామని..విద్యార్థుల్లో భరోసా నింపుతామని స్పష్టం చేశారు.ఢిల్లీ ఆందోళన సమయంలో విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వాల్యానాయక్, అభిలాష్‌రావు, రాజేశ్వర్‌గౌడ్, వెంకన్న, నర్సింహులు, శివరాజ్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.