– బూర్గంపహాడ్ తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 12 : నోటీసులు అందుకున్న ఓటర్లు మేజర్ పంచాయతీ సారపాకలో సమాచారం అందించాలని తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ తెలిపారు. శనివారం మేజర్ పంచాయతీ కార్యాలయంలో బీఎల్వో, సంబంధిత అధికారులతో సర్పంచ్ గుగులోత్ కిశోర్నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి అక్షరాలు తప్పుగా వచ్చిన వారికి నోటీసులు అందజేశామని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వద్ద ఉన్న ఆధారాలతో పంచాయతీ కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు అధికారులు సూచించిన డాక్యుమెంట్లను అప్పగించాలని తెలిపారు.
నోటీసులు అందుకోని ఓటర్లు నోటీసులు అందుకుని వాటికి సంబంధించిన ఆధారాలు అధికారులకు అందించి ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలన్నారు. సర్ ప్రక్రియ విధుల్లో పాల్గొనే అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండి ఓటర్లకు సహకరించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరు నమోదు చేసుకోవాలని, అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి గుగులోత్ రవికుమార్, వీఆర్వోలు ప్రసాద్, సీతమ్మ, బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.