కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 12 : సింగరేణి కార్మిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణానికి చెందిన సంధ్యాల హైమావతి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. సింగరేణిలో కార్మికుడిగా పని చేసిన స్థానిక మధుర బస్తీకి చెందిన సంద్యాల కొమరయ్య, శంకరమ్మల కుమార్తె హైమావతి. ఇటీవల ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం ఛాన్స్ లర్ శివప్రసాద్ శుక్ల చేతుల మీదుగా ఆమె డాక్టరేట్ అందుకున్నారు. డాక్టర్ ఆలియా మేడం పర్యవేక్షణలో రసాయన శాస్త్ర విభాగంలో ” డాకింగ్ స్టడీస్ అండ్ టెట్రాజోల్ డేరివాటివ్స్” అంశంపై చేసిన పరిశోధన పత్రానికి హైమావతికి పట్టా లభించింది. పేదరికం నేపథ్యం నుండి వచ్చినప్పటికీ పట్టుదలతో చదివి ఉన్నత విద్యలో రాణించి డాక్టరేట్ పట్టా పొందడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.