రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటలను కొనడానికి చేతగాక రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కారు.. ప్రపంచ సుందరీమణులు పిల్లలమర్రి సందర్శనకు ఎక్కడా లేని హంగామా చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖజానాలో చిల్లి గవ్వలేదంటూనే సుందరీమణుల కోసం రూ.కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సీఎం సొంత జిల్లాలో రైతులు ధాన్యం అమ్మడానికి నానా కష్టాలు పడుతుంటే వారిని గాలికొదిలేసి ఆగమేఘాలపై రూ.కోట్లు ఖర్చు చేసి హంగామా చేయడం అవసరమా అని నిలదీశారు. ధాన్యం కొనాలని రోడ్డెక్కితే లాఠీ ఝుళిపించే పోలీసులు కొంతమంది అతిథుల కోసం వెయ్యి మంది రక్షణ ఏర్పాట్లు చేయడం బాధాకరమన్నారు. అనవసరపు ఆర్భాటాలను వదిలేసి కనీసం పదోవంతైనా రైతులు పడుతున్న ఇబ్బందులపై అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.