హన్వాడ, డిసెంబర్ 12 : కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ మోసపూరిత మాటలు చెబుతున్నదని, వాటిని నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రజలకు సూచించారు. శుక్రవారం మండలంలో ని హన్వాడ, సల్లోనిపల్లి, వేపూర్, మునిమోక్షం గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులైన సర్పంచ్, వార్డు అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లో చేసిన అభివ్పద్ధిని చూసి బీఆర్ఎస్ మద్దతుదారులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో మీ కళ్లు ముందు ఉందన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తామన్న పింఛన్ రూ.4వేలు, ఆడబిడ్డల పెళ్లికి ఇస్తామన్న తులం బం గారం, మహిళలకు ఇస్తామన్న రూ 2,500, రైతులకు ఇవ్వాల్సిన రూ.500 బోనస్ ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. మళ్లీ కాంగ్రేస్ పార్టీ అభ్యర్ధులకు ఓటు వేసి మోసపోవద్దని, మొ న్నటి వరకు రైతులు యూరియా కోసం ఎంత ఇబ్బంది పడ్డా రో మీరందరు చూశారని గుర్తుచేశారు. అందుకే బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి గ్రామ అభివ్పద్ధికి నిధులు తీసుకోస్తారని, అందుకే ప్రజలందరూ బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నరేందర్, మాజీ ఎంపీపీ బాలరాజు, పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, నాయకులు నాగన్న, శ్రీనివాసులు, జంబులయ్య, పెంటయ్య, హరిచందర్, ఖాజాగౌడ్ పాల్గొన్నారు.