గద్వాల, నవంబర్ 4 : ‘ఇథనాల్ కంపెనీ కాలుష్య కారకమని.. పచ్చని పొలాలు సైతం బీళ్లుగా మారే ప్రమాదం ఉన్నదని.. తుంగభద్ర జలాలు, తాగు, సాగునీరు కలుషితమయ్యే ప్రమాదం నెలకొన్నది’.. అం టూ 12 గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం గద్వాల కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన రై తులు ఈ కంపెనీ మాకొద్దంటూ నినదించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రాజో ళి మండలం పెద్ద ధన్వాడ శివారులో 29 ఎకరాల పంట పొలాల్లో గాయిత్రీ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ప్రైవేటు లిమిటెడ్ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఫ్యాక్టరీ ఏర్పాటైతే పెద్దధన్వాడ, చిన్నధన్వాడ, నసనూర్, మాన్‌దొడ్డి, చిన్నతాండ్రపాడు, వేణిసోంపురం, నౌరోజిక్యాంప్, కేశవరం, తుమ్మిళ్ల, పచ్చర్ల, తనగల, పెద్దతాండ్రపాడు, రాజోళి గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని హెచ్చరించారు.
కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం, వ్యర్థ జలాలతో క్యాన్సర్‌తోపాటు శ్వాసకోశ వ్యాధుల బారిన ప్రజలు పడే అవకాశం ఉన్నదన్నారు. అయితే అక్కడే దళితుల కోసం 152 ఎకరాల భూమిని గతంలో ఇచ్చారని.. 173 సర్వేనెంబర్లో చిన్నధన్వాడ దళితులకు గృ హనిర్మాణం కోసం 2009లో నాటి ప్రభుత్వం ఆరెకరాల భూమి కేటాయించినట్లు గుర్తు చేశారు.
ప్లాట్లు, పొలాల మధ్య నిర్మించే ఫ్యాక్టరీతో కాలుష్యం వెలువడే అవకాశం ఉందన్నా రు. ఇదంతా సమీపంలోని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తే ప్రజలతోపాటు పశు, పక్షాదు లు తాగి వన్యప్రాణుల మనుగడేకు భారీ ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇలా తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్కు నీటిని ఎత్తి పోయడంతో సాగు చేసే పంటలు చేతిక రాకపోగా.. అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పంటలు బీళ్లుగా మారే ప్రమాదం ఉన్నదన్నారు.
ఏదైనా కంపెనీ ఏర్పాటు చేయాలంటే ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని, కానీ ఇక్కడ మాత్రం అభిప్రాయ సేకరణ లేకుండా ఏకపక్షంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణతోపాటు ఏపీలోని పలు గ్రామాలవాసులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని, ప్రజలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేయొద్దన్నారు.