వనపర్తి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ‘పది నెలల్లోనే కాంగ్రెస్ పరిపాలన చేతగానితనం బట్టబయలైంది.. ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పింది.. ఇప్పటికే ప్రజలతోపాటు ఆ పార్టీ నేతల్లోనూ నైరాశ్యం నెలకొన్నది.. రైతులు సర్కారుపై కన్నెర్ర చేస్తున్నారు.. పాలమూరు బిడ్డ రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నా ఒరిగిందేమీ లేదు’.. అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈనెల 29వ తేదీన వనపర్తిలో రైతు నిరసన సదస్సు చేపట్టిన నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి వేచి చూశామని.. అయినా మార్పు రాకపోగా దేశానికి అన్నంపెట్టే రైతన్నలను నిలువునా మోసం చేస్తుండడాన్ని సహించేది లేదన్నారు. వ్యవసాయశాఖ మాజీ మంత్రిగా, రైతుబిడ్డగా అన్నదాతల బాధలను అర్థం చేసుకుని వనపర్తిలో రైతు నిరసన సదస్సు పెట్టక తప్పలేదన్నారు. అనతికాలంలోనే ఇంతలా రైతు వ్యతిరేకతను ఏ ప్రభుత్వం మూటగట్టుకోలేదని చెప్పారు.
జవాబు : కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఏనాడూ ఇంత కష్టం లేదు. పదేండ్ల పా లనలో అన్ని విధాలుగా అండగా నిలిచాం. ఇప్పుడిప్పుడే బలపడుతున్న రైతులను కాంగ్రెస్ మళ్లీ పాతాళంలోకి తొక్కేలా వ్యవహరిస్తున్నది. మోసపూరిత వాగ్దానాలకు మోసపోయామని తెలుసుకున్నారు. ఎన్నికలకు ముందు తేదీలను ప్రకటించి చేస్తామన్న రుణమాఫీ, రైతుభరోసా పథకాలేవీ అమలు కానందునే తీవ్ర ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి.
ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ప్రజలే ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆచరిస్తున్న తీరు తెన్నులపై ప్రజలకు స్పష్టత వచ్చింది. కరెంట్ ఇవ్వకపోవడం, రైతుభరోసా డబ్బులు ఎగవేత, రుణమాఫీ జరిగిన తీరు, పింఛన్ల పెంపు చేయకపోవడం తదితర హామీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొ క్కింది. కాంగ్రెస్ మోసాన్ని గ్రహించే తిరుగుబాటు చేస్తున్నారు.
పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి పాలనపై మీరేమంటారు?
పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏదో మంచి చేస్తారని ఆశించాం. పది నెలల్లో ఆ సంతోషం ఇసుమంతైనా లేకుండా పోయింది. పక్క జిల్లా నల్లగొండలోని ఎస్ఎల్బీసీకి రూ.4 వేల కోట్లు కేటాయించడంపై ఏమాత్రం బాధ లేదు. కానీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించకపోవడం అత్యంత బాధాకరం. చివరి దశలో ఉన్న ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసి వట్టెంలో మోటర్లను నీట ముంచారు. పది లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టుపై పది నెలల్లో ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడం దుర్మార్గం. ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలున్నా నోరు మెదపకపోవడం విడ్డూరం. ఈ పరిస్థితుల్లో సంతోషం ఎక్కడుంటుంది, ఎందుకుంటుంది.
పథకాల అమలులో వైఫల్యాలకు కారణాలేమని అనుకుంటున్నారు?
అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేకుండానే అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. హామీల అమలు అటుంచితే పాలన పూర్తిగా గాడితప్పింది. గతంలో నుంచి కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నాయకులు సైతం మనం ప్రజలకు చెప్పిందేమిటీ? చేస్తున్నదేమిటీ? అని ప్రభుత్వ పనితీరుపై నైరాశ్యంలో ఉన్నారు. ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పబ్బం గడపాలని చూస్తున్న కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.
అధికారం కోసం వెంపర్లాడటం బీఆర్ఎస్ అభిమతం కాదు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఆగ్రగామిగా నిలబెట్టడమే ముఖ్యం. పదేండ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే రాష్ర్టాన్ని నెంబర్‌వన్‌గా నిలిపినం. నేడు హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది. అర్థం పర్థం లేని హైడ్రా, మూసీ సుందరీకరణ అంటూ హంగామాతో పీకల్లోతుకు వెళ్లింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్థిక దివాలా అంచున సర్కారు ప్రయాణం సాగుతున్నది. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది.
భూముల ధరలు పట్టణాలు, గ్రామాలన్న తేడా లేకుండా అమాంతం పడిపోయాయి. అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. కాంగ్రెస్ పాలనలో కారుచీకట్లు కమ్ముకొని ప్రజలు ఛీ కొడుతున్నారు. దశాబ్దాలపాటు ఉద్యమ చరిత్ర ఉన్న బీఆర్ఎస్కు ఆటుపోట్లు, ఉద్యమాలు, పోరాటాలు కొత్తకాదు. ప్రజా సమస్యలను ప్రతిపక్ష హోదాలో ఎండగడుతాం. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తాం. అందులో భాగంగానే ఈనెల 29న వనపర్తిలో రైతు నిరసన సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతోపాటు పలువురు నేతలు పాల్గొననున్నారు.