వనపర్తి, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించి బొట్టుబొట్టు నీటిని ఒడిసి పట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, మాజీ సీఎం కేసీఆర్ సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పోడు భూములు సాగుచేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, ఇంకా మిగిలిన గిరిజన రైతులకు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
ఆదివారం వనపర్తి మండలంలోని తిరుమలయ్యగుట్ట అటవీ ప్రాంతంలో నిర్మించిన తిరుమలాయకుంట, పెద్దగూడెం పరిధిలోని దీద్యా కుంటలను మాజీ మంత్రి రైతులతో కలిసి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ సందర్శించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి వృథా కాకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్నామన్నారు. వనపర్తి నియోజకవర్గలోనూ అనేక చోట్ల నీటిని ఒడిసి పట్టేందుకు నిర్మాణాలు చేపట్టామన్నారు.
ఇందులో నిర్మాణం జరిగినవే తిరుమలాయకుంట, దీద్యా కుంటలన్నారు. ఈ కుంటల వల్ల ఈ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న రైతులకు, ప్రత్యేకంగా గిరిజన రైతులకు మేలు జరుగుతుందన్నారు. సాధారణ పొలాలతోపాటు గిరిజనులు పోడు భూములను సాగు చేసుకునే వారని, వారందరికీ పట్టాలు ఇచ్చి భరోసా కల్పించడం జరిగిందన్నారు.
అయితే, ఇంకా మరో 62 మంది రైతులు పట్టాలు పొందాల్సి ఉందని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వంలోనే వీరికి పట్టాలు అందజేయడం జరుగుతుందని సింగిరెడ్డి భరోసా ఇచ్చారు. అనంతరం నిండునీటితో తొణకిసలాడుతున్న ఈ కుంటల్లో పూలు చల్లి సింగిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా నాయకులు వాకిటి శ్రీధర్, మాణిక్యం, రవిప్రకాశ్‌రెడ్డి, ధర్మానాయక్, మహేశ్వర్ రెడ్డి, నారాయణ, సునీల్, రాము, హుస్సేన్, సాయిప్రసాద్, కొండన్న, కృష్ణానాయక్, రవినాయక్, బాబునాయక్ తదితరులు ఉన్నారు.