నాగర్‌కర్నూల్, నవంబర్ 3 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11నెలలు గడిచినా రాష్ట్రంలో అసమర్థ పాలనతో నైరాశ్యం నెలకొన్నదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భరోసా యాత్ర చేపడుతానని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో పూర్తిగా వైఫల్యం చెందడం వల్ల మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాలకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పెండింగ్ పనులను పూర్తి చేయడంలో సీఎంకు చిత్తశుద్ధి లేదన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పాలమురు-రంగారెడ్డి పథకంలోని 3వ ప్యాకేజీ పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయలేకపోతే డిసెంబర్ 7వ తేదీన చేపడుతానన్న నిరసన దీక్ష యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. కాల్వల సామర్థ్యాన్ని పెంచి రిజర్వాయర్లను పూర్తి చేస్తే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని మంత్రులు పేర్కొన్నారని, మరి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నీట మునిగిన మోటర్లను ఎందుకు పట్టించుకోవడం లేదని, బురదలో ఉన్న మోటర్లను నీటితో కడిగారే తప్పా వాటిని ఎందుకు మరమ్మతులు చేయడం లేదని నిలదీశారు.
రెండు మోటర్లు పనిచేయవని అధికారులు స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని గోప్యం గా ఉంచుతున్నారని మండిపడ్డారు. బ్లాస్టింగ్ జరిగే సందర్భంలో కేఎల్ఐ ప్రాజెక్టు మోటర్లకు ప్రమాదం ఏర్పడుతుందని తెలిసినా నిర్లక్ష్యం చేశారని, దీనివల్లే మోటర్లు నీట మునిగాయని ఆరోపించారు. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అర్థం రవి, బాలాగౌడ్, లక్ష్మ య్య, అహ్మద్, సత్యం, వెంకటేశ్, వెంకటస్వామి, అర్జునయ్య, సుబ్బయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు.