నారాయణపేట, జూన్ 3: అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్చార్జి మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం సింగారం చౌరస్తా వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నారాయణపేట నియోజకవర్గంలో ఎక్కువ మందితో సభ్యత్వం చేయించి పార్టీని పటిష్టం చేసి తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి తిరిగి వచ్చేందుకు కృషి చేయాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలు మారే వారికి సభ్యత్వంలో చోటు కల్పించరాదన్నారు. తెలంగాణ కోసం పోరాడే సైనికులచే, పార్టీ కోసం పనిచేసే వారిచే సభ్యత్వం చేయించాలన్నారు. యువతకు, 33శాతం మహిళలకు, రైతులకు సభ్యత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైతులు పార్టీ మారలేదని, కాంగ్రెస్ ప్రభు త్వం చెప్పిన మాటలకు మోసపోయి ఓట్లు వేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సభ్యత్వ నమో దు సమయంలో అధికార పార్టీ బెదిరింపులకు భయపడరాదని, అండగా మీ వెంట నేను ఉంటానని భరోసా ఇచ్చారు. పేట నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి రాజీవ్‌సాగర్ మాట్లాడుతూ గత 75 ఏళ్లల్లో చేపట్టని అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో గత పదేళ్ల కాలంలో జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు, చిన్న పిల్లల కోసం ప్రభుత్వ దవాఖాన, రోడ్లు వెడల్పు ఇతర అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. గతం కన్నా ఎక్కువగా పార్టీ సభ్యత్వ నమోదును చేయించాలని, ముఖ్యంగా యువతకు, మహిళలకు ప్రాధాన్యతం కల్పించాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి వినియోగించుకొని చనిపోయిన ఓటర్లను, డబుల్ ఓటర్లు తొలగించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.