ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆస్తితో పాటు ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు.వేసవి కాలం రాకముందే ఎండలు మండుతున్నాయి. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యాపార, వాణిజ్య ప్రదేశాల్లో, పత్తి పరిశ్రమల్లో, గోదాముల్లో, ఇండ్లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు దరిచేరవు. గతేడాది వనపర్తి జిల్లాలో 105 ప్రమాదాలు జరగగా.. రూ.1.88 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖాధికారులు సూచిస్తున్నారు.
వనపర్తి, ఫిబ్రవరి 21 : ఎండాకాలం ప్రారంభమైంది. అగ్ని ప్రమాదాల చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. వేసవిలో చిన్న నిర్లక్ష్యంతో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిని అరికట్టడంలో అగ్నిమాపక శాఖ సకాలంలో స్పందించాలి. దీనికి తోడు అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతం చేయాల్సి ఉంటుంది.
వనపర్తి జిల్లాలో మూడు అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. వనపర్తి పరిధిలో (వనపర్తి, గోపాల్పేట, పాన్గల్, రేవల్లి, ఖిల్లాఘణపురం, వీపనగండ్ల, శ్రీరంగాపురం, చిన్నంబావి), కొత్తకోట పరిధిలో (కొత్తకోట, పెబ్బేర్, పెద్దమందడి, మదనాపురం), ఆత్మకూర్ పరిధిలో ఆత్మకూరు, అమరచింత మండలాలు ఉన్నాయి. మూడు కేంద్రాల్లో మూడు ఫైర్ ఇంజన్లతోపాటు వనపర్తి, ఆత్మకూరు పరిధిలో ఒక బుల్లెట్ వాహనంతో కూడిన చిన్నపాటి అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉన్నది. ప్రతి శుక్రవారం అవగాహన జిల్లాలోని మూడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో ఆయా పట్టణాల, మండలాలు, గ్రామాల్లో ప్రతి శుక్రవారం ఒక గ్రామాన్ని లేదా పట్టణాన్ని లేదా మండలానికి ఎంచుకొని అవగాహన కల్పిస్తున్నారు. విద్యాలయాలు, ప్రధాన చౌరస్తాల్లో, బస్టాండుల్లో, ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలను తీసుకోవాలో సిబ్బంది వివరిస్తున్నారు. ఒకవేళ ప్రమాదాలు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఫైర్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటే అగ్ని ప్రమాదాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రమాదాలు చోటుచేసుకోకుండా నివారణ చర్యల్లో ప్రతి శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎలాంటి ప్రమాదాలు జరిగినా కాల్సెంటర్ 101, వనపర్తి సెల్ : 8712699366, కొత్తకోట సెల్ : 8712699370, ఆత్మకూరు సెల్ : 8712699368 నెంబర్లకు సంప్రదించాలి. ముందస్తు సమాచారంతో పెద్దపెద్ద ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.
– చంద్రశేఖర్, అగ్నిమాపక శాఖాధికారి, వనపర్తి