అయిజ, జూలై 13 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 65,000 క్యూసెక్కులు ఉండగా, ఒక గేటు ఎత్తి దిగువకు 6,823 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 36,035, నెట్టెంపాడ్కు 750, భీమా లిప్టు-1కు 1, 300, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల ఎడమ కాల్వకు 1, 030, కుడి కాల్వకు 470, ఆర్డీఎస్ లింక్ కాల్వకు 150, పారలాల్ కాల్వకు 950, భీమా లిఫ్టు – 2కు 750 క్యూ సెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రా జెక్టు ద్వారా మొత్తం అవుట్ ఫ్లో 47,068 న మోదైంది.
జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.087 టీఎంసీల నిల్వ ఉన్నది. తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. 9 క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేరకు ఎత్తి దిగువకు 26,055 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. టీబీ డ్యాం ఇన్‌ఫ్లో 43,209, అవుట్‌ఫ్లో 36,094 క్యూసెక్కులుగా ఉన్నది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 77.74 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 36,443, ప్రధాన కాల్వకు 457 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సుంకేసుల బరాజ్‌కు 35,991 క్యూసెక్కుల నీరు చేరుతోంది.
దేవరకద్ర, జూలై 13 : జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌కు జలకళ సంతరించుకున్నది. ఆదివారం సాయంత్రం నాటికి ప్రాజెక్టులో నీటిమట్టం 24.5 ఫీట్లకు చేరింది. మరో 8ఫీట్ల నీరు వచ్చి చేరితే ప్రాజెక్టు షెటర్లను తెరుస్తారు.