మహబూబ్నగర్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉ మ్మడి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భా రీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. భారీ వర్షాలకు అటు వాగులు వంకలు ఉప్పొంగడం, ఇటు ప్రాజెక్టుల గేట్లు తెరుచుకోవడంతో ఒక్కసారిగా వరద నీరు పొలాలను ముంచెత్తింది. మరోవైపు చెరువులు అలుగులు పారి వందలాది ఎకరాల పంట నీటిపాలైంది. సుమారు లక్ష ఎకరాల వరకు పంట నష్టం సంభవించినట్లు అనధికార వర్గాల అంచనా.
అయితే వ్యవసాయ అధికారులు మాత్రం పంట నష్టం వివరాలు సేకరిస్తున్నామని ఇప్పుడే అంచనా వేయలేకపోతున్నామని చెబుతున్నారు. ఇంకా చాలా జిల్లాల్లో గ్రామాలకు వెళ్లే రహదారులు తెగిపోవడం, వంతెనలు, కాజ్వేల్లో వరద నీరు పారుతుండడంతో అధికారులు పంటనష్టం అంచనా వేయలేకపోతున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం లో ఉమ్మడి జిల్లా అధికార యంత్రం పూర్తిగా విఫలమైంది. అనేక చోట్ల ఇంకా జలదిగ్బంధంలోనే గ్రామాలు ఉన్నాయి. బయటి ప్రపంచంతో చాలా గ్రామాలకు కనెక్టివిటీ తెగిపోయింది. మహబూబ్నగర్-తాండూర్ రహదారి మరమ్మతు పనులు చాలా నిదానంగా సాగుతుండడంతో వందలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
రద్దీగా ఉండే ఈ రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీవర్షంతో మహబూబ్నగర్ పట్టణం పూర్తిగా జలమయమైంది. చాలాచోట్ల అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టకపోవడంతో కాలనీవాసులు సొం తంగా డ బ్బులు ఖర్చు పెట్టుకొని వరద నీటిని తోడుకుంటున్నా రు. మరికొన్ని చోట్ల వారే వరద నీరు వెళ్లేందుకు ప్రొక్లెయిన్లతో కాల్వలు తవ్వుకుంటున్నారు. అయితే ఉమ్మడి జిల్లా అంతా భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నా.. జిల్లాకు చెందిన మంత్రి బాధితులను పట్టించుకోకపోవడం, కనీసం పరామర్శకు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లా అధికారులతో వరద పరిస్థితిపై కనీసం సమీక్షలు కూడా జరపకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు భారీ వర్షాలకు ఇల్లు కూలి నిరాశ్రయులైన వారిని సురక్షిత ప్రదేశాల్లో ఉంచి వారికి వసతి ఏర్పాటు చేయకపోవడంతో బాధితులు గుళ్లు గోపురాల్లో తలదాచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇండ్లు కూలి ముగ్గురు చనిపోయినా ప్రభుత్వ తరఫున వారికి నష్టపరిహారం కూడా అందించలేకపోయారు. ఇటు అధికార యంత్రాంగం అటు జిల్లా ఎమ్మెల్యేలు చుట్టపుచూపుగా వచ్చి పోతున్నారని బాధితులు వాపోతున్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు జనాలను పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. భారీ వర్షాల నేపథ్యంలో చాలా గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట సబ్స్టేషన్ నీట మునగడంతో చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది.