కేటీదొడ్డి/గట్టు/మల్దకల్/ఇటిక్యాల/హన్వాడ/ఊట్కూరు/దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 6 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను వర్షం వదలడం లేదు. గురువారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కేటీదొడ్డి మండలంలో 56.4 మి.మీ., గట్టులో 48.4 మి.మీ., మల్దకల్లో 53.2 మి.మీ., మద్దూ రులో 92.2 మి.మీ., నారాయణపేటలో 70.0 మి.మీ., మాగనూరులో 88.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు మరోసారి పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకాయి. కల్వర్టుల వద్ద వరద పెద్ద ఎత్తు న పారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇటిక్యాల మండల కేంద్రంలోని ఊర చెరువు ఆలుగు పారడంతో ఎస్సీ కాలనీ ప్రజలకు గ్రామంతో సంబంధాలు తెగిపోయాయి. పలు గ్రామాల సమీపంలో ఉన్న రైల్వే అండర్ పాస్లలో లోతుగా నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మల్దకల్ మండలంలో దాదాపు 100 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. మహబూబ్నగర్-తాండూరు రోడ్డుపై ఇబ్రహీంబాద్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. అలుగు నుంచి బైక్పై ఓ వ్యక్తి వెళ్తుడంగా ఉధృతికి కిందపడగా.. అక్కడున్న యువకులు వెంటనే బైకును బయటకు తీశారు.
చిన్నచింత కుంట మండలం ఉంద్యాల గ్రామం హరిజన వాడలోని పలు ఇండ్లల్లోకి సమీపంలోని చెరువు నీళ్లు చేరాయి. ఊట్కూర్ మండలం పగిడిమర్రి, కొత్తపల్లి, బిజ్వారం గ్రామాల మధ్య ప్రయాణం సాగలేదు. పలు గ్రామాల్లో పాత ఇండ్లు నేలమట్టమయ్యాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వరుణుడు కరుణతో ఎడతెరపి లేకుండా వానలు పడడంతో పంటలకు నష్టం ఏర్పడింది.