గద్వాల, ఆగస్టు 12 : ఎగువ నుంచి జూరాల వరద హోరు కొనసాగుతుండడంతో అధికారులు 11గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం ఎగువ నుంచి జూరాలకు 70వేల క్యూసెక్కుల వరద రాగా 11గేట్లు ఎత్తి దిగువకు 44,495 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో విద్యుదుత్పత్తికి 38,666 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తు తం 318.14మీటర్లు గా ఉంది. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ నీటిసామర్థ్యం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.434 టీ ఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 70వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో నమోదవుతుండగా దిగువకు 88,267 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లు, విద్యుదుత్పత్తి, లిఫ్ట్‌ల ద్వారా మొత్తం దిగువకు 88,267 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రాత్రి వరకు వరద పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందిని, వరద తగ్గితే గేట్లు తగ్గించే అవకాశం ఉందని డ్యాం అధికారులు తెలిపారు.
శ్రీశైలం, ఆగస్టు 12 : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదనీటితో శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా తలపిస్తుంది. బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 38,666 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్ల ద్వారా 44,495 క్యూసెక్కులు మొత్తంగా 83,161 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సాయంత్రానికి 76,416 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వచ్చి చేరుకున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగానూ ప్రస్తుతం 879.10 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకుగాను ప్రస్తుతం 183.41 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు నమోదయ్యాయి. కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేయగా ఎడమగట్టు విద్యుదుత్పతి కేంద్రంలో నాలుగో యూనిట్ ట్రయిల్ రన్ కోసం, 5 యూనిట్ల ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని, వినియోగించి దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో రెండు రోజులుగా ప్రారంభమైన నాలుగో యూనిట్ ట్రయల్ రన్ ఉత్కంఠగా మారింది. ఇప్పటివరకు పలు విధాలైన సాంకేతిక పరీక్షలు చేసి తర్వాత యూనిట్‌పై లోడ్ వేసిన అధికారులు స్వల్ప సాంకేతిక లోపాలను గుర్తించినట్లు సమాచారం. బుధవారం ట్రయల్ రన్ నడుస్తుండగా యూనిట్లో వచ్చిన ఎయిర్‌గ్యాప్ అవాంతరాన్ని జెన్కో అధికారులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
అయిజ ఆగస్టు 12 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. బుధవారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 31,431 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,680 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం గరిష్ఠ స్థాయి నీటిమట్టం1633 అడుగులకు గానూ ప్రస్తు తం 1627.61 అడుగుల నీటిమట్టం ఉండ గా, 105.788 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 85.359 టీఎంసీల నీటి నిల్వ ఉందని డ్యాం సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు.