ఊట్కూర్, జూన్ 15 : భూ తగాదాల నేపథ్యం లో దాయాదుల చేతిలో గువ్వలి సంజీవ్ (28) దారుణ హత్యకు గురైన ఘటనకు సంబంధించి ఐదుగురిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఆయన ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో సమావేశమై వివరాలను వెల్లడించారు. ఊట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామానికి చెందిన గువ్వలి లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు.. మొదటి భార్య స వారమ్మకు ఎర్రగండ్ల సంజప్ప, రెండో భార్య తిప్పమ్మకు పెద్ద సవారప్ప, చిన్న సవారప్ప సంతానం ఉన్న ట్లు తెలిపారు. తండ్రి వారసత్వపు ఆస్తిని ఇద్దరు భార్యలకు బదులు ముగ్గురు కొడుకులకు సమానంగా పంచడాన్ని సంజప్ప కుమారులు వ్యతిరేకిస్తున్నారు. మొత్తం తొమ్మిదెకరాలను ముగ్గురికి సమానంగా పంచడంతో సర్వే నెంబర్ 112 సంబంధించిన రెండెకరాల పొలం విషయంలో ఎర్రగండ్ల సంజప్ప కుమారులు రెండేళ్ల కిందటే కోర్టును ఆశ్రయించారన్నారు. మూడేళ్లుగా ఆస్తి కోసం వివాదం నడుస్తుండగా పోలీసులు, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు సైతం పెట్టారని తెలిపారు. ఈ విషయంపై పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైందన్నారు. కాగా ఈనెల 13న పెద్ద సవారప్ప, అతని కుమారుడు సంజీవ్, తమ్ముడు చిన్న సవారప్ప, మరదలు కవిత తమ పేర్లపై ఉన్న రెండెకరాల వివాదాస్పద భూమిలో విత్తనాలు వేసేందుకు ట్రాక్టర్‌తో దున్నుతుండగా దాయాదులు గువ్వలి కిష్టప్పతోపాటు మరి కొందరు అడ్డుకున్నారన్నారు.
ఈ నేపథ్యంలోనే పొలాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడినట్లు వివరించారు. దాయాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన గువ్వలి సంజీవ్‌ను మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కాగా పెద్ద సవారప్ప, చిన్న సవారప్ప, కవితకు రక్తస్రావమైనట్లు పేర్కొన్నారు. మృతుడి చిన్నమ్మ కవిత ఫిర్యాదు మేరకు మొత్తం ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న చిన్న వెంకటప్పకు గాయాలవడంతో చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించామన్నారు. ఏ3గా ఉన్న ఆటో సంజీవ్ పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ఐదుగురు నిందితులైన గువ్వలి సంజీవ్ అలియాస్ (గుట్టప్ప), గువ్వలి నట్టల్ వెంకటప్ప, గుడ్డి ఆశప్ప, గువ్వలి శ్రీను, గువ్వలి కిష్టప్పను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందినప్పటికీ సకాలంలో స్పందించకపోవడంతో ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేశామన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి పోలీసుల నిర్లక్ష్యం ఉందని తేలితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతి భద్రతల దృష్ట్యా చిన్నపొర్లలో పోలీస్ పికెట్‌ను కొనసాగిస్తామన్నారు. సమావేశంలో సీఐలు చంద్రశేఖర్, రామ్‌లాల్, మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి, పీఆర్వో వెంకట్, పోలీసులు పాల్గొన్నారు.